Begin typing your search above and press return to search.

సడెన్ గా ఢిల్లీకి...జగన్ ఏం చేయబోతున్నారు...?

By:  Tupaki Desk   |   29 Jan 2023 8:22 AM GMT
సడెన్ గా ఢిల్లీకి...జగన్ ఏం చేయబోతున్నారు...?
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ని సడెన్ గా పెట్టుకున్నారు. నిజానికి జగన్ ఢిల్లీ ఇపుడు వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అయితే ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కి ఆయన హాజరవుతారని, అది ఈ నెల 31న ఉందని అంటున్నారు. అయితే ఇది చాలా రోజుల క్రితమే షెడ్యూల్ అయింది. అప్పటి సమాచారం మేరకు ఏపీ నుంచి అధికారులే హాజరవుతారని అనుకున్నారుట. కానీ జగన్ తాను ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యేందుకు రెడీ అయ్యారు.

జగన్ ఢిల్లీ టూర్ లో కేవలం ఈ ఈవెంట్ మాత్రమే ఉందా లేక ఏవైనా ఇతర ప్రోగ్రామ్స్ ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. జగన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన అపాయింట్మెంట్ కోరారని చెబుతున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతారు అని అంటున్నారు.

ఇక జగన్ ఈ నెల 27, 28 తేదేల నుంచి ఢిల్లీ వెళ్ళేందుకు అన్ని ఇతర ప్రోగ్రామ్స్ ని రద్దు చేసుకున్నారు అని అంటున్నారు. విశాఖ లో శారదాపీఠంలో జరిగే రాజశ్యామల కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో క్యాన్సిల్ అయింది. ఢిల్లీ అపాయింట్మెంట్ల విషయంలో తేలకపోవడం వల్లనే ఇలా జరిగింది అంటున్నారు.

ఇక విశాఖలో మార్చి నెల 2, 3 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. దానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులు ప్రముఖ పరిశ్రమల అధిపతులు హాజరవుతారని అంటున్నారు. ఈ ఈవెంట్ తో ఏపీ పారిశ్రామిక ప్రగతి గతిని మార్చాలని వైసీపీ భావిస్తోంది. అందుకోసమే ఇన్వెస్టర్స్ మీటింగ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కి జగన్ పని గట్టుకుని వెళుతున్నారని అక్కడ ఏపీ గురించి ప్రత్యేకించి విశాఖ గురించి ఫోకస్ చేస్తారు అని అంటున్నారు.

ఇక కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రధానిని కలసి పోలవరం నిధులతో పాటు, ఏపీకి ఆర్ధికంగా భరోసా ఇచ్చే ప్రాజెక్టుల మీద కూడా చర్చిస్తారు అంటున్నారు. వీటితో పాటు ఏపీలో మారుతున్న రాజకీయం నేపధ్యంలో పొత్తులు ఎత్తుల గురించి బీజేపీ కేంద్ర పెద్దల మనసులో ఏముందో ఆయన తెలుసుకుంటారని అంటున్నారు.

వీటితో పాటు ఒకవేళ కలసి వస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే విషయం కూడా కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావిస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ చాలా పనులు పెట్టుకుని ఢిల్లీ వెళ్తున్నారు. మరి ఆయన రాజకీయ భేటీలు సమావేశాలు ఎలా సాగుతాయి వాటి ఫలితాలు ఏంటి అన్నది చూడాల్సి ఉంది. జగన్ ఢిల్లీ టూర్ మాత్రం ఆసక్తిని కలిగిస్తోంది.