టీడీపీ చీకటి బాణం : జగన్ మీద ఆ రేంజిలో అసంతృప్తి ఉందా... ?

Mon Sep 26 2022 06:00:09 GMT+0530 (India Standard Time)

AP CM Ys Jagan Mohan Reddy

వైసీపీ అధికారంలో ఏడాది మించి ఉండదని టీడీపీ స్టార్టింగ్ లో ఒక పద్ధతిలో  అంచనా వేసుకుంది. దానికి కారణం జగన్ కి పాలనాపరమైన అనుభవం లేకపోవడం 151 సీట్లతో బండ మెజారిటీ రావడంతో 1983 నాటి పరిస్థితులను టీడీపీతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా గుర్తు చేసుకున్నారు. ఎన్టీయార్ కూడా మొదటి దఫాలో భారీ మెజారిటీతో అవస్థలు పడి ఏణ్ణర్ధంకే వెన్నుపోటుకు గురి అయ్యారు. అయితే ఉద్యమ ఫలితంగా మళ్ళీ  అధికారం దక్కినా ఆయన ఎవరినీ నమ్మలేక మధ్యంతరానికి వెళ్లారు.జగన్ కూడా సేమ్ టూ సేమ్ అని టీడీపీ భావించిందని చెబుతారు. అందుకే ముందస్తు ఎన్నికలు ఏ క్షణంలో అయినా ఎన్నికలు అంటూ ఆనాడు టీడీపీ అధినాయకత్వం తరచూ ప్రకటనలు చేస్తూ వచ్చేది. అయితే కరోనా రెండేళ్ల పాటు ఉండడం ఈలోగా జగన్ సర్కార్ బాగానే నిలదొక్కుకుని మూడేళ్ళు పూర్తి చేసుకోవడం అలా చకచకా  జరిగిపోయాయి.

అయిదేళ్ళ టెర్మ్ లో మూడేళ్ళకు పైగా ఉన్న జగన్ బాగానే సర్కార్ ని నడుపుకుని వచ్చినట్లుగా లెక్క. కరోనా వంటి విశ్వ విపత్తు వేళ కూడా ఆయన పాలనారధాన్ని సాఫీగానే నెట్టుకొచ్చారు అని విమర్శకులు సైతం అనే పరిస్థితి వచ్చింది. ఇక మరో వైపు అప్పులు పెరిగిపోయాయి. దాని వల్ల సంక్షేమానికి సంక్షోభం వస్తుంది జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అనుకున్నారు. అయితే  ఇపుడు ఆ సీన్ కూడా కనిపించడంలేదు.

ఇపుడు చూస్తే ఏపీ ఆదాయం పెరిగింది. అవసరానికి మించి అప్పులు తేలేకపోయినా పెరిగిన  ఆదాయ వనరులు సమయానికి ఆదుకుంటున్నాయి. అంటే మొత్తానికి వైసీపీ సర్కార్ కుదుటపడినట్లే అనుకోవాలి. దీంతో టీడీపీ ముందస్తు ముచ్చట్లు మానేసి 2024 లోనే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అని డిసైడ్ అయిపోయింది. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఒక బాంబు లాంటి వార్తను పేల్చారు.

వైసీపీలో ఎనభై మంది ఎమ్మెల్యేలు జగన్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారు తిరుగుబాటు చేస్తారని దేవినేని ఉమా మహేశ్వరరావు అంటున్నారు. తన ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక జగన్ నానా అవస్థలు పడుతున్నారని కొత్త విషయం చెప్పారు. ఇదే నిజమనుకుంటే మాత్రం వైసీపీ బిగ్ ట్రబుల్ లో పడినట్లే.

అయితే అలా జరుగుతుందా జరిగేందుకు అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయని విశ్లేషించుకున్నపుడు మాత్రం కష్టమే అన్న మాట వినిపిస్తుంది. ఇపుడున్న 151 మంది ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం ఫస్ట్ టైమ్ నెగ్గినవారే. పైగా వారిని లీడ్ చేసే సెకండ్ గ్రేడ్ లీడర్ షిప్ అన్నది వైసీపీలో ఏ కోశానా లేదు. అక్కడ ఉన్నది  అంతా జగన్ మాత్రమే.

ఇక ఎనభై మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే సర్కార్ కచ్చితంగా కూలుతుంది. అలా జరిగితే అది జగన్ కి  రాజకీయ లాభాన్నే తెస్తుంది. తనకు వెన్నుపోటు పొడిచారని ఆయన అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారు. 1984 నాటి పొలిటికల్ సీన్ రిపీట్ అవుతుంది. కానీ అంత పని జరుగుతుందా. వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉన్న మాట నిజం. అయితే అది ఆ రేంజిలో ఉందా. ఉంటే పిల్లి మెడలో గంట కట్టేవారెవరు అన్నదే కీలకమైన ప్రశ్న.

ఇక్కడ చూసుకుంటే కేంద్రంతో జగన్ మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇలా  దుస్సాహసం చేసినా బోల్తా కొట్టకతప్పదు. దాని వల్ల జగన్ కే మేలు జరుగుతుంది. మరి దేవినేని ఉమా ఊరకే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారా అంటే రాజకీయాలు కాబట్టి ఇలాంటి ప్రకటనలు ఉంటాయి. అలాగని తేలికగా తీసేయడానికీ ఉండదు

నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఒక్కటి మాత్రం నిజం. టికెట్లు దక్కవనుకునే వారు తమకు హ్యాండ్ ఇస్తారని భావించే వారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఖాయం. అయితే వారు కూడా ఇప్పటప్పట్లో సందడి చేయరు ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అలా చేస్తారు. సో అంతవరకూ సర్కార్ కి  ఢోకా లేనట్లే అనుకోవాలేమో.