మాకొద్దీ రాజకీయమన్నా వినిపించుకోరా....జగన్ మీద సంచలన వ్యాఖ్యలు

Mon Sep 26 2022 05:09:02 GMT+0530 (India Standard Time)

AP CM Ys Jagan Mohan Reddy

ఏపీ సీఎం జగన్ మీద బీజేపీ ఘాటు గానే కామెంట్స్ చేస్తోంది. ఆ పార్టీ ఏపీవ్యాప్తంగా అయిదు వేల సభలను నిర్వహిస్తోంది. దాంతో నాయకులు అంతా ఏపీలో కలియతిరుగుతున్నారు. వారంతా కూడా వైసీపీనే డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది అని నిందిస్తున్నారు. అభివృద్ధి లేదు అంతటా విద్వంశమే అని కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.ఇక బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అయితే జగన్ మీద పదునైన బాణాలే వేశారు. 2014 ఎన్నికల్లో మీ తల్లి విజయమ్మను ఓడించి విశాఖ ప్రజలు మాకొద్దీ రాజకీయం అన్నా వినిపించుకోరా అని మండిపడ్డారు. విశాఖ మీద జగన్ కి ప్రేమ లేదని తన తల్లిని ఓడించారన్న కక్ష సాధింపే చేస్తున్నారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

ఇక చూస్తే ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులి వెందులలో ఏడు వేల కోట్ల శంకుస్థాపనలు ఆర్భాటంగా జరిపారని తీరా చూస్తే ఇప్పటికి ఏడు కోట్ల పధకం కూడా పూర్తవలేదుని ఇదంతా హడావుడి  కాక మరేమిటి అని నిలదీశారు.  ఏపీకి చెందిన కీలకమైన పోలవరం ప్రాజెక్టు లో అవకతవకలు జరిగాయని సత్యకుమార్ అంటున్నారు. ఒక్కసారిగా పోలవరం  ముంపు భూములు 30 వేల ఎకరాలకు ఎలా  పెరిగింది అన్నది వైసీపీ నేతలే జవాబు చెపాలని ఆయన డిమాండ్ చేశారు.

అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి 45 వేల ఎకరాలనుంచి 15 వేల ఎకరాలకు పడిపోయింది. ఇది ఎలా జరిగింది అన్నది వైసీపీ నేతలు వాస్తవాలను  చెప్పగలరా అని నిలదీశారు. ఇవన్నీ అవకతవకలు కావా అని ఆయన ప్రశ్నించారు. ఇక కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఏం పరిహారం ఇచ్చారని సత్యకుమార్ ప్రశ్నించారు. పోలవరం విషయంలో కేంద్రం మీద ఆడిపోసుకోవడమే తప్ప  పోలవరం ప్రాజెక్ట్ గురించి లెక్కలు ఎపుడైనా కరెక్ట్ గా చెప్పారా అని సత్యకుమార్ అంటున్నారు.

ఎంతసేపూ  పోలవరం డబ్బులు అని అడుగుతారే తప్ప తాము ప్రాజెక్ట్ గురించి చెప్పాల్సిన విషయాలు చెప్పలేరా అని ఆయన మండిపడ్డారు. ఏపీలో రోడ్లు చూస్తే అద్వాన్నంగా ఉన్నాయి అయినా ఒక్క రోడ్డు అయినా వైసీపీ ప్రభుత్వం వేయలేకపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు  పెట్రోలు రేట్లు తగ్గించకుండా లక్షా 90 వేల కోట్లు సంపాదించుకున్నారని మరి ఆ నిధులు అన్నీ కూడా ఏమవుతున్నాయని కనీసం కొన్నిరోడ్లన్నా వేయలేకపోతున్నారేమని సత్యకుమార్ ప్రభుత్వ పెద్దలను నిలదీస్తున్నారు.

మూడున్నరేళ్ళుగా ఏపీలో పాలన లేదని అభివృద్ధి అన్నది అసలే  లేదని అమరావతి రాజధాని నుంచి జనాలను మభ్యపెట్టడానికి సడెన్ గా మూడు రాజధానులు అంటున్నారని సత్యకుమార్ ఫైర్ అయ్యారు. కనీసం ప్రజాస్వామ్య నియమ నిబంధలను కూడా మరచి  వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారని తీరా ఎన్నికల సంఘం ప్రశ్నించగానే అబ్బే జగన్ ఒప్పుకోలేదని సలహాదారు సజ్జల  కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చింది చేసినదే ఎక్కువ అని సత్యకుమార్ అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ వాసులు వైసీపీ రాజకీయాలు వద్దని అంటున్నారని బీజేపీ నేత చెప్పడమే హైలెట్ మరి. దాని మీద వైసీపీ నేతలు ఏమంటారో చూడాలి.