Begin typing your search above and press return to search.

లాస్ట్ సీఎం జగనేనా...అందుకే ఇలాగనా...?

By:  Tupaki Desk   |   11 Feb 2022 4:30 PM GMT
లాస్ట్ సీఎం జగనేనా...అందుకే ఇలాగనా...?
X
చూస్తూంటే ఏపీ సుదీర్ఘ చరిత్ర కానీ ఉజ్వల భవిష్యత్తు కానీ పాలకులు ఆలోచిస్తున్నట్లుగా లేదు. ఈ రోజు మేమున్నాం, పప్పు అన్నం తినేద్దాం, అప్పులు తెచ్చి అయినా కధ నడిపేద్దామని ఆలోచిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక ఏపీలో ఆస్తులు టోటల్ గా తాకట్టు అయిపోతున్నాయి. అది ఎంతవరకూ వచ్చింది అంటే ఏకంగా పార్కులు కూడా ఇపుడు తాకట్టు బారిన పడుతున్నాయి. అంటే ఒకపుడు పెద్ద సంస్థలతో మొదలుపెడితే పార్కుల దాకా వచ్చేశారా అనే అన్నది అందరి విస్మయం, ఆవేదన కూడా.

జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్ళు అయింది. మరో రెండున్నరేళ్లు ఆయన ఉంటారు. ఆ తరువాత పరిస్థితి ఏంటి. ఇది ఆలోచిస్తున్నారా అన్నదే చంద్రబాబు అడుగుతున్న సూటి ప్రశ్న. జగన్ అయిన కాడికి అన్నీ అమ్మేస్తూ పోవడానికి ఆయన ఏమైనా ఏపీకి చివరి సీఎం అనుకుంటున్నాడా అని బాబు లాజిక్ పాయింటే తీశారు. నీ తరువాత కూడా సీఎంలు వస్తారు, వారు కూడా పాలన చేయాలి, ఇక ఏపీకి సొంత ఆస్తులు ఉండాలి కదా అని కూడా బాబు అంటున్నారు. ఇది కూడా పాయింటే మరి.

జగన్ ఇప్పటిదాకా పాలనలో అక్షరాలా ఏడువేల కోట్ల దాకా అప్పులు చేశారని, వీటి వల్ల ప్రతీ కుటుంబం మీద అయిదు లక్షలకు పైగా అప్పు వచ్చి పడిందని బాబు అంటున్నారు. ఇన్నేసి అప్పులు చేసి జగన్ రేపు తప్పుకుంటే దాన్ని తీర్చాల్సింది ప్రజలే అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తాను చేసిన అప్పుల మీద శ్వేత పత్రం రిలీజ్ చేయాలని కూడా బాబు కోరుతున్నారు.

మరో వైపు చూస్తే లక్షలలో అప్పులు తెస్తున్నారు కదా ప్రజలకు ఉపశమనం ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు, ఆఖరుకు చెత్త మీద కూడా పన్నులు వేస్తున్నారని, గ్యాస్, లిక్కర్, నిత్యావసరాలు అన్ని ధరలూ ఏపీలోనే ఎక్కువ అని చంద్రబాబు అన్నారు. ఇక్కడ చంద్రబాబు అన్నారని కాదు కానీ ఉన్న ఆస్తులు తాకట్టు పెడితే ఒక విధంగా సంక్షోభంలో ఉన్నట్లు లెక్క. అదే సమయంలో ఆస్తులే ఏ రాష్ట్రానికైనా ధీమాగా ఉంటాయి.

అలాగే చూస్తే పాలకులు రావచ్చు, పోవచ్చు. ఎన్ని ఆస్తులు పెరిగాయి అన్నదే అభివృద్ధికి కొలమానం. ఇపుడు చూస్తే అలాంటి పరిస్థితి అయితే ఏపీలో కనిపించడం లేదు అన్నది మేధావుల వాదనగా ఉంది. ఇంకో వైపు చూస్తే రేపు జగన్ మళ్ళీ సీఎం అయినా కూడా కొత్తగా అప్పు చేయడానికైనా తకట్టు పెట్టడానికైనా ఏమైనా మిగులుతాయా అన్నదే అతి పెద్ద డౌట్. మొత్తానికి రేపటి ఎన్నికల్లో గెలిచి మేము సీఎం అవుతామని ఎవరు అనుకున్నా వారు భారాలు మోయాల్సిందే. భయపడాల్సిందే. ఒక విధంగా వారి నెత్తిన ఏపీ సీఎం పదవి ముళ్ల కిరీటం కాబోతోంది అన్నది సత్యమని విశ్లేషణలు ఉన్నాయి.