Begin typing your search above and press return to search.

#ద‌స‌రా.. టాలీవుడ్ కి ఏపీ CM జగన్ దిమ్మ‌తిరిగే గిఫ్ట్

By:  Tupaki Desk   |   14 Oct 2021 4:17 AM GMT
#ద‌స‌రా.. టాలీవుడ్ కి ఏపీ CM జగన్ దిమ్మ‌తిరిగే గిఫ్ట్
X
టాలీవుడ్ కి ఏపీ CM జగన్ నుంచి దిమ్మ‌తిరిగే గిఫ్ట్ అందింది. గ‌డిచిన కొద్దికాలంగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ని అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఊహించ‌ని విధంగా తాజా నిర్ణ‌యాల‌ను వెలువ‌రిస్తోంది. ఇటీవ‌ల మంత్రి పేర్ని నాని సినీప్ర‌ముఖుల‌తో మంత‌నాలు సాగిస్తూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తుండ‌గా మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ద‌స‌రా గిఫ్ట్ ని ప్ర‌క‌టించి టాలీవుడ్ లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసేలా చేసింది.

కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఓ ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించింది. ఇక‌పై ఏపీ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించడానికి అనుమతించింది. ఆ మేర‌కు లాక్ డౌన్ సడలింపులను ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా కానుకగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వు నేటి (గురువారం) నుండి అమలులోకి వచ్చింది. ఇది ఎగ్జిబిట‌ర్ల‌కు పెద్ద ఊర‌ట‌. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నుండి 100 శాతం ఆక్యుపెన్సీని అనుమతించిన సంగ‌తి తెలిసిందే. జూలై 8 నుంచి 50 శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు తిరిగి తెరవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది కానీ వంద‌శాతానికి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు.

అయితే వంద శాతం అనుమ‌తులు ఇచ్చినా కోవిడ్ ప్రోటోకాల్ ని ప్ర‌జ‌లు పాటించ‌ల్సిందే. సినిమా హాళ్ల లోపల తప్పనిసరిగా మాస్క్.. హ్యాండ్ శానిటైజేషన్ త‌ప్ప‌నిస‌రి. సామాజిక దూరం పాటించాలి. కోవిడ్ -19 భద్రతా పద్ధతులను అనుసరించి థియేటర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య షోలు నిర్వహించడానికి అనుమతులున్నాయి. గురువారం నుండి 100 శాతం సామర్థ్యంతో పనిచేసేటప్పుడు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఎగ్జిబిష‌న్ వ‌ర్గాల్ని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏదేమైనా మునుముందు పెద్ద సినిమాల రిలీజ్ ల‌కు ఇది లైన్ క్లియ‌ర్ చేస్తోంద‌నే భావించ‌వ‌చ్చు. ఇక ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌లపైనా ప్ర‌భుత్వ పోర్ట‌ల్ పైనా మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంది.

ప‌వ‌న్ తో సెట్ రైట్ అయిన‌ట్టేనా?

ఇటీవ‌ల ప‌వ‌న్ వ‌ర్సెస్ వైకాపా ఎపిసోడ్స్ తెలిసిందే. రిప‌బ్లిక్ వేదిక‌పై ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ అనంత‌రం ప‌రిశ్ర‌మ‌లో ఆందోళ‌న మ‌రింత తీవ్ర‌త‌ర‌మైంది. దీంతో దిద్దుబాటు చ‌ర్చ‌లకు ఛాంబ‌ర్ పెద్ద‌లు ప్ర‌య‌త్నించారు. ప‌రిశ్ర‌మ నిర్మాత‌లు దిల్ రాజు..సునీల్ నారంగ్...బ‌న్నీవాసు..మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేతలు త‌దిత‌రులు మంత్రి పేర్ని నానీ తో స‌మావేశ‌మై ప్ర‌భుత్వానికి తాము వ్య‌తిరేకులం కానే కాద‌ని ప్ర‌క‌టించారు. ఆన్ లైన్ టిక్కెటింగ్..ఆక్యుపెన్సీ..టిక్కెట్ ధ‌ర‌ల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ సాగించారు. ఈ చ‌ర్చ‌లు దాదాపు ఓ కొలిక్కి వ‌చ్చాయ‌ని అప్ప‌ట్లో క‌బురందింది. స‌మావేశంలో మంత్రి సానుకూలంగా స్పందించారు. నిర్మాత‌ల‌కు..పంపిణీదారులు..థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు సానుకూలంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న‌ మాటిచ్చారు.

వంద శాతం ఆక్యుపెన్సీ..టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం సానుకూలంగానే స్పందించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. మ‌ల్టీప్లెక్స్..ఏ సెంట‌ర్ల‌లో 150 రూపాయ‌లు.. మున్సిప‌ల్ ఏరియాల్లో 120 రూపాయ‌లు.. పంచాయితీల్లో 100 రూపాయ‌లు గా టిక్కెట్ ధ‌ర‌లు నిర్ణ‌యించార‌ని తెలిసింది. ఇక ప్ర‌భుత్వానికి చెల్లించే ట్యాక్స్ విష‌యంలో వెసులుబాట్లు క‌ల్పించారుట‌. అటు నిర్మాత‌ల‌కు..ఇటు ప్రేక్ష‌కుల‌కు భారం ప‌డ‌ని రీతిలో త‌క్కువ శాతానికే ట్యాక్స్ ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. అయితే ఇవ‌న్ని ద‌స‌రా సంద‌ర్భంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికి వంద‌శాతం ఆక్యుపెన్సీకి లైన్ క్లియరైంది.

ద‌స‌రా సీజ‌న్ లో పెద్ద సినిమా రిలీజ్ లు ఏవీ లేవు ఇప్ప‌టికి. తాజాగా మారిన ప‌రిణామాల‌తో మునుముందు పెద్ద సినిమాల రిలీజ్ ల‌పైనా క్లారిటీ వ‌స్తుంద‌నే భావిస్తున్నారు. అలాగే ఆన్ లైన్ టిక్కెటింగ్ విష‌యంలో ఓ ఎజెన్సీని ఏర్పాటు చేసి త‌ద్వారా విక్ర‌యాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి నాని గ‌త స‌మావేశంలో తెలిపారు. ఇలా చేయ‌డం వ‌ల్ల బ్లాక్ మార్కెట్ ని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని...నిర్ధారించిన ధ‌ర‌ల‌కే టిక్కెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవ‌చ్చ‌ని...కౌంట‌ర్ల ద‌గ్గ‌ర వెయిట్ చేసే ప‌ని ఉండ‌ద‌ని మంత్రి అన్నారు. దానిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంటుంది.