Begin typing your search above and press return to search.

దేవినేని కోరికను సీఐడీ తీర్చటం ఖాయమేనా ?

By:  Tupaki Desk   |   22 April 2021 4:07 AM GMT
దేవినేని కోరికను సీఐడీ తీర్చటం ఖాయమేనా ?
X
ఎప్పుడెప్పుడు అరెస్టవుదామా ? అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాచుకుని కూర్చున్నారు. ఇద్దరు మాజీమంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్టు తర్వాత టీడీపీలో తర్వాత వంతు ఎవరిది అనే చర్చ జరిగింది. అప్పుడు దేవినేని మాట్లాడుతు తనను అరెస్టు చేయటానికి ప్రభుత్వం కుట్రపన్నుతున్నట్లు పదే పదే ఆమధ్య గొంతుచించుకున్నారు.

సీన్ కట్ చేస్తే ప్రభుత్వం దేవినేని అసలు పట్టించుకోలేదు. అయితే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేసినందుకు పోలీసులు దేవినేనిపై కేసు నమోదుచేశారు. తిరుపతిపై జగన్ అనని మాటలను అన్నట్లుగా ఓ ఫేక్ వీడియో సృష్టించి దాన్ని ఉపఎన్నికల సమయంలో దేవినేని తిరుపతిలో మీడియా ముందు ప్రదర్శించారు. దానిపై మాజీమంత్రిపై వైసీపీ నేతలు ఫిర్యాదుచేశారు. మొత్తం వీడియోను చూసిన తర్వాత అది ఫేక్ వీడియో అని నిర్ధారణకు వచ్చిన తర్వాత కేసును పోలీసులు సీఐడీకి బదిలిచేశారు.

విచారణకు రావాలంటే సీఐడీ అధికారులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా దేవినేని లెక్కచేయలేదు. దాంతో సీఐడీ అధికారులు నేరుగా మాజీమంత్రి ఇంటికే చేరుకున్నారు. తనకోసం సీఐడీ అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న దేవినేని ఇంట్లోనుండి పరారయ్యారు. ఇపుడు ఉన్నతాధికారులు మాజీమంత్రి ఆచూకీ కోసం తెగ వెతుకుతున్నారు. దేవినేనికి సన్నిహితుల కదలికలపైన కూడా నిఘాపెట్టారు.

అరెస్టు కోసం ఎప్పటినుండో తహతహలాడిన దేవినేని తీరా కోరిక తీరే సమయానికి ఎందుకని పరారైపోయారో అర్ధం కావటంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పోరాటం ఆగదని, అవసరమైతే తన ప్రాణాలను కూడా లెక్కచేయనని చాలా గంభీరమైన సినిమా డైలాగులు చెప్పిన మాజీమంత్రి అసలు విచారణకే పత్తాలేకుండా ఎందుకు పారిపోయారు ?

దీన్నిబట్టే దేవినేని ఎంతటి ధైర్యస్తుడో అర్ధమైపోయింది. తాను తప్పు చేయలేదని అనుకున్నపుడు అసలు విచారణకు ఎందుకు హాజరుకాలేదు ? ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం వేరు, విమర్శించటం వేరు. ఇది ప్రతిపక్షాల్లో చాలామంది నేతలు చేస్తున్నదే. కానీ మార్ఫుడు వీడియోలతో జనాలను తప్పుదోవ పట్టించాలని చూడటం ఏమిటో అర్ధం కావటంలేదు. దేవినేని మరీ ఇంత చీపుగా వ్యవహరిస్తారని ఎవరు అనుకోలేదు. పరారీలో ఉన్న దేవినేని కోరికను సీఐడీ అధికారులు ఎప్పుడు తీరుస్తారో చూడాల్సిందే.