Begin typing your search above and press return to search.

ఇరకాటంలో ఏపీ బీజేపీ నేతలు

By:  Tupaki Desk   |   2 Aug 2021 10:41 AM GMT
ఇరకాటంలో ఏపీ బీజేపీ నేతలు
X
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడం ఖాయమని తేలిపోయింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో మరోసారి స్పష్టం చేసింది. విశాఖపట్నం నుంచి ఆదివారం ఢిల్లీకి వివిధ పార్టీల నేతలు, కార్మిక నేతలు, కార్మికులు ప్రత్యేక రైలులో బయలు దేరారు. దానికి ముందు వైజాగ్ లో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ ఎత్తున ఆందోళన కూడా జరిగింది.

ఓవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఏపీలో సాగుతుంటే దీన్ని పక్కనపెట్టిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు మరో వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదాన్ని రాజేసిన బీజేపీ నేతలు ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులపై పడ్డారు.

పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. రాష్ట్రంలో 30 ఏళ్లుగా నీటి పారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు దీన్ని హఠాత్తుగా ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? నానా యాగీ చేస్తున్నారంటే అక్కడ విశాఖ లొల్లి ముదిరిపోయిందనే అన్న వాదనను ఆ కార్మికులు తెరపైకి తెస్తున్నారు.

ఒకవైపు పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం నానా తిప్పలు పెడుతోంది..దానిపై ప్రశ్నించకుండా కేంద్రం ఇచ్చిన కోట్లను పట్టుకొని ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న హంగామా విమర్శలకు తావిస్తోంది.

గడిచిన నాలుగు నెలలుగా వైజాగ్ లో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుంటే ఒక్క నేత కూడా కనీసం ఒక్కసారి కూడా పరామర్శించలేదు.ఇప్పుడు కూడా ప్రైవేటీకరణ జరగదని అబద్ధాలతో మభ్య పెట్టేందుకు ఏపీ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు కేంద్రం స్పష్టం చేస్తున్నా కూడా ఇంకా బీజేపీ నేతలు ఏమొహం పెట్టుకొని తిరుగుతున్నారని విశాఖకార్మికులు దుమ్మెత్తి పోస్తున్నారు.