Begin typing your search above and press return to search.

దీని తర్వాతే.. ఏపీ అసెంబ్లీ రద్దు!

By:  Tupaki Desk   |   5 Dec 2022 7:30 AM GMT
దీని తర్వాతే.. ఏపీ అసెంబ్లీ రద్దు!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే బడ్జెట్‌ సమావేశాల తర్వాత ఏపీ అసెంబ్లీ రద్దు అవుతుందా అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, తదితరాలు ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పడు ఈ కోవలో వైసీపీ మంత్రులు సైతం చేరిపోయారు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని సీదిరి అప్పలరాజు వంటి మంత్రులు చెబుతుండటం ముందస్తు ఎన్నికలు వస్తాయనడానికి నిదర్శనమని చెబుతున్నారు. అధిష్టానం ఆదేశాలు లేకుండా మంత్రి సీదిరి అప్పలరాజు ఇలాంటి ప్రకటన చేయరని అంటున్నారు.

ఇప్పటికే ఏపీ తీవ్ర ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలు వస్తున్నాయి. ప్రతి నెలా పదో తేదీ వస్తే కానీ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు పడటం లేదని పలు పత్రికల్లో, టీవీ చానెళ్లలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే కేంద్రం నిర్దేశించిన పరిమితిని మించి రాష్ట్రం అప్పులు చేసిందని.. ఇక కొత్త అప్పులు చేయడానికి మార్గం కూడా లేదని చెబుతున్నారు. చివరకు ప్రభుత్వ కార్పొరేషన్లపైన కూడా రుణం తెచ్చుకుందని గుర్తు చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. మరోవైపు ఏపీ ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా పూర్తి స్థాయిలో పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

అలాగే టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జనసేన–బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది. తమ కూటమిలోకి టీడీపీని కూడా చేర్చుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వకూడదనే ఉద్దేశంతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. బీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు.

ఈ నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు 2024 ఏప్రిల్‌/మేలో ఉండే అవకాశం ఉంది. ఈ లోపు ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా ఒకేచోట సమీకృతమవుతుంది. ఇది వైసీపీకి నష్టం చేసే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ప్రశాంత్‌ కిశోర్‌ సైతం వైఎస్‌ జగన్‌కు సూచించినట్టు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి కట్టకముందే, ఆ కూటమి బలపడకముందే, ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా బాగా పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదని ప్రశాంత్‌ కిశోర్‌ సూచించినట్టు చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌ సైతం దీంతో డైలమాలో పడ్డారని.. ముందస్తు ఎన్నికల వైపు మొగ్గుచూపే వీలుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి తర్వాత బడ్జెట్‌ పెట్టి అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు బలంగా చెలరేగుతున్నాయి. ఏప్రిల్‌ కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుంది. దీంతో ఆ ఆర్థిక సంవత్సరంలో మళ్లీ కొత్త అప్పులకు కేంద్రం అనుమతి ఇస్తుంది. దీంతో కేంద్రం నిర్దేశించిన మేరకు అంటే సుమారు రూ.60 వేల కోట్లు అప్పులు తీసుకునే వీలుంటందని అంటున్నారు. ఆ మొత్తంతో మరిన్ని కొత్త పథకాలను ప్రకటించి ప్రజలకు పంచుతారని లేదా ఉన్న పథకాల పేరుతోనే ప్రజలకు పంచుతారని చెబుతున్నారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లే చాన్సుందని ఢంకా బజాయించి పేర్కొంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.