Begin typing your search above and press return to search.

పెట్టుబడి సాధనలో ఏపీ 2 స్థానం.. తెలంగాణ తెలిస్తే కేటీఆర్ కు ఇబ్బందే

By:  Tupaki Desk   |   24 Jun 2021 3:30 AM GMT
పెట్టుబడి సాధనలో ఏపీ 2 స్థానం.. తెలంగాణ తెలిస్తే కేటీఆర్ కు ఇబ్బందే
X
జరిగే ప్రచారాలకు సంబంధం లేనట్లుగా కొన్ని వాస్తవాలు ఉంటాయి. పెట్టుబడుల సాధన విషయంలో తెలంగాణ దూసుకెళుతున్నట్లుగా తరచూ ప్రచారం జరుగుతుంటుంది. మరి.. ఇందులో నిజం ఎంత? అన్న విషయాన్ని తాజాగా ప్రాజెక్టు టుడే సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో ఏపీలోని జగన్ సర్కారు సాధించిన ఘనతను కళ్లకు కట్టేలా చెప్పింది.

రాష్ట్రానికి పరిశ్రమల్ని ఆకర్షించే విషయంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిస్తే.. ఏపీ రెండో స్థానంలో నిలవటం విశేషం. సాధారణంగా పెట్టుబడులను ఆకర్షించే విషయంలో మహారాష్ట్ర.. గుజరాత్..తమిళనాడు రాష్ట్రాలు ముందు ఉంటాయి. అందుకు భిన్నంగా తాజాగా ఏపీ రెండో స్థానంలో నిలవటం విశేషంగా మారింది. చంద్రబాబు హయాంలో పెట్టుబడుల సాధన కోసం అదే పనిగా విదేశీ పర్యటనలు జరపటం.. కోట్లాది రూపాయిలు ఖర్చు చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా ఎలాంటి విదేశీ పర్యటనలు లేకుండానే దేశంలో రెండో స్థానంలో నిలిచేలా చేయటం జగన్ సర్కారు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పాలి.

గత ఏడాదిలో మహారాష్ట్ర రూ.55,714 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తే.. ఏపీకి రూ.29,784 కోట్లు.. గుజరాల్ రూ.26,530 కోట్లు.. తమిళనాడు రూ.24వేల కోట్లు.. కర్ణాటక రూ.14వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. అన్నింటికి మించిన ఏపీతో పోలిస్తే.. పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడి ఉన్నట్లుగా ఈ నివేదిక చెబుతోంది. ఇంతకాలం మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో తెలంగాణ దూసుకెళుతున్నట్లు చెప్పటం తెలిసిందే. అందుకు భిన్నంగా తాజా నివేదికలోని విషయాలు మరోలా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఏమైనా తాజా నివేదిక మంత్రి కేటీఆర్ ను ఇబ్బంది పెట్టేలా ఉందని చెప్పక తప్పదు.