కాంగ్రెస్ - ఆప్ బేరం..తెగేదేనా?

Thu Apr 18 2019 20:00:01 GMT+0530 (IST)

AAP-Congress talks stall over Haryana alliance

ఒకవైపు రెండు విడతల పోలింగ్ పూర్తి అయ్యింది. అయితే ఇప్పటికీ ఈ సార్వత్రిక ఎన్నికల విషయంలో కొన్ని నియోజకవర్గాల పొత్తు వ్యవహారాలు తేలడం లేదు. కొన్ని రాష్ట్రాల్లోనే ఇంకా పొత్తు చర్చలు సాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యన అందుకు సంబంధించి తర్జనభర్జనలు సాగుతూ ఉన్నాయి.ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు సోషల్ మీడియాలో సాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ - ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ల  మధ్యన ట్విటర్ వేదికగా అందుకు సంబంధించిన చర్చలు సాగుతూ ఉన్నాయి. అయితే ఇవి ఎడతెగడం లేదు.

వీళ్ల పొత్తు వ్యవహారం అంతా ఒకే విషయంలో ముడిపడి ఉంది. తాము ఢిల్లీలో కాంగ్రెస్ కు కొన్ని సీట్లు ఇవ్వాలంటే.. తమకు హర్యానా - పంజాబ్ లలో సీట్లు ఇవ్వాలనేది ఆప్ ప్రతిపాదనగా తెలుస్తోంది. అయితే తమకు ఎంతో కొంత బలం ఉన్న పంజాబ్ హర్యానాల్లో ఆప్ ను భుజానికి ఎత్తుకుంటే అది తమ భవిష్యత్తుకే చేటు అని కాంగ్రెస్ భావిస్తోంది.

ఇప్పటికే పంజాబ్ హర్యానాల్లో ఆప్ అడుగు పెట్టింది. ఇప్పుడు అలాంటి ఆప్ ను అక్కడ ఎంకరేజ్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఢిల్లీ వరకూ సీట్ల సర్దుబాటుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉంది.

అయితే కేవలం ఢిల్లీలో మాత్రమే పొత్తంటే.. ఆప్ సై అనడం లేదు. కాంగ్రెస్ తో పొత్తు ద్వారా పంజాబ్ హర్యానాల్లో బలపడాలని ఆప్ లెక్కలేస్తోంది. అయితే ఆప్ తో పొత్తుకు నో అని పంజాబ్ సీఎం - కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ తేల్చి చెబుతున్నారు. హర్యానాల్లోని కాంగ్రెస్ నేతలు కూడా అదే మాటే చెబుతున్నారు.

ఈ నేఫథ్యంలో ఆప్ అలుగుతోంది. కాంగ్రెస్ తో పొత్తు లేదని అంటోంది. అయితే కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఢిల్లీ వరకూ అయినా ఆప్ ను కన్వీన్స్ చేసుకోవాలని - రెండు పార్టీలూ కలిస్తేనే అక్కడ బీజేపీని ఓడించడం సాధ్యం అవుతుందని భావిస్తోంది. మరోవైపు వీళ్లు పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న ప్రాంత పరిధిలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ  కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్- ఆప్ ల కథ ఏమవుతుందో!