Begin typing your search above and press return to search.

రీల్ కథ కాదు రియల్ స్టోరీ.. మటన్ కావాలా? మొగుడు కావాలా?

By:  Tupaki Desk   |   4 Dec 2021 4:09 AM GMT
రీల్ కథ కాదు రియల్ స్టోరీ.. మటన్ కావాలా? మొగుడు కావాలా?
X
ఇప్పుడు మీరు చదివేది రీల్ స్టోరీ కాదు.. రియల్ స్టోరీ. కానీ.. చదువుతున్నంతసేపు ఇదేదో సినిమా కథలా అనిపిస్తుంది కానీ.. అది నిజం కాదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఈ తరహా ట్రయాంగిల్ లవ్ స్టోరీని మీరెప్పుడూ చదివి ఉండరు.. విని ఉండరు. సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతూ.. విపరీతంగా వైరల్ అవుతున్న ఈ కథనం చదివినంతనే అవాక్కు అవ్వాల్సిందే.

నూటికి నూరు శాతం శాఖాహారి అయిన ఒక వ్యక్తికి.. అపురూప సౌందర్యరాశి అయిన ఒక అమ్మాయితో పెళ్లైంది. అయితే.. పెళ్లికి కాస్త ముందు.. ఆమె కాబోయే భర్తకు ఒక రహస్యాన్ని షేర్ చేసింది. ఇంతకూ ఆమె చెప్పిన ఆ సీక్రెట్ ఏమంటే.. తమ ఇంట్లో ఎవరికి తెలీకుండా మటన్ తింటానని.

తమది కూడా శుద్ధ శాఖాహారి కటుంబమే అయినప్పటికీ.. అనుకోకుండా ఒకసారి మటన్ రుచి చూశానని.. అప్పటి నుంచి దాని ప్రేమలో పడిపోయానని.. అది తినకుండా ఉండలేనని చెప్పింది. ఇప్పటివరకు తాను ఇంట్లో వారికి తెలీకుండా దొంగతనంగా తింటున్నట్లు ఆమె చెప్పింది. దీంతో.. కాబోయే భర్తకు ఒక పెద్ద ధర్మసంకటంగా మారింది.

ఇంట్లో తెలీకుండా తిన్న నేపథ్యంలో.. ఆ విషయాన్ని పట్టించుకోనని చెప్పాడు. అంత అందమైన అమ్మాయిని వదులుకోవటం ఇష్టం లేని అతగాడు.. మటన్ తిన్న విషయాన్ని మర్చిపోవాలని భావించాడు.

ఇందులో భాగంగా పెళ్లికి ముందు ఆమెతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఏం జరిగినా వదిలేయ్. పెళ్లి తర్వాత మాత్రం తినకూడదన్న కండీషన్ పెట్టాడు. అందుకు ఆ అమ్మాయి ఓకే చేసింది.

లైఫ్ లో మళ్లీ మటన్ జోలికి పోనని ఆమె మాట ఇవ్వటంతో మరో ఆలోచన లేకుండా పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారి కాపురం ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సాగింది. అయితే.. పెళ్లి కాక ముందు ఎలా అయితే తన తల్లిదండ్రులకు తెలీకుండా మటన్ తినేదో.. అదే రీతిలో పెళ్లి తర్వాత భర్తకు కూడా తెలీకుండా మటన్ తినటం మొదలు పెట్టింది. ఆ విషయాన్ని గుర్తించిన భర్త.. ఆమెను నిలదీశాడు. అంతేకాదు.. భార్యకు లాస్ట్ వార్నింగ్ అంటూ.. నీకు మెగుడు కావాలో.. మటన్ కావాలో తేల్చుకో అని వార్నింగ్ ఇచ్చేశాడు.

ఆవేశంతో భార్యను అంత మాట అనేశాడే కానీ.. అతడినో అనుమానం వేధిస్తోంది. అందగత్తె అయిన తన భార్య మటన్ మీద మోజుతో తనతో పెళ్లి బంధాన్ని తెంచుకుంటే తన పరిస్థితి ఏమిటి? అన్న సందేహం కలిగింది. ఆ వెంటనే.. తనకు తెలిసిన ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ కు లేఖ రాశాడు. తన పరిస్థితిని వివరించాడు.

దీనికి స్పందనగా సదరు ఫ్యామిలీ కౌన్సిలర్ నుంచి రిప్లై వచ్చింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మీరు ప్రపంచ రికార్డును క్రియేట్ చేయనున్నారని.. ఒక అమ్మాయి.. మనిషి.. మేకలో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

అంతేకాదు.. సదరు భర్త గుండెలు అవిసిపోయే విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన అభిప్రాయం ప్రకారం.. ప్రేమించిన వ్యక్తి లేకుండా జీవించొచ్చు కానీ ఆహారం లేకుండా బతకలేమని.. మరి నీ భార్య ఎవరిని ఎంచుకుంటుందో ఊహించు అంటూ.. గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా బదులిచ్చాడు.

ఈట్రయాంగిల్ లవ్ స్టోరీలో కౌన్సిలర్ ఇచ్చిన సమాధానానికి సంబంధించిన ఒక క్లిప్ బయటకు రావటం.. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్ంయింది. దీంతో ఈ అంశంపై ఎవరికి వారు స్పందిస్తున్నారు. అత్యధికులు మటన్ శాశ్వితమని.. ఆమె భర్తకు బదులుగా మటన్ కే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదంతా చూస్తున్న ఆ భర్త పరిస్థితిని తలుచుకుంటేనే.. అయ్యోపాపం అనిపించక మానదు.