Begin typing your search above and press return to search.

వైర‌స్‌తో తెలంగాణ‌లో తొలిసారిగా ప్ర‌జాప్ర‌తినిధి మృతి

By:  Tupaki Desk   |   6 July 2020 11:50 AM GMT
వైర‌స్‌తో తెలంగాణ‌లో తొలిసారిగా ప్ర‌జాప్ర‌తినిధి మృతి
X
మంత్రులు.. ఎమ్మెల్యేలు.. అధికారుల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ప‌రీక్ష‌లు పెంచ‌డంతో భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. రోజుకు దాదాపు రెండు వేల చొప్పున కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. హైద‌రాబాద్ త‌ర్వాత తెలంగాణ‌లో అత్య‌ధిక కేసులు ఉన్న జిల్లా సంగారెడ్డి. ఈ జిల్లాలో భారీగా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా ఈ జిల్లాలో వైర‌స్‌తో తొలి ప్ర‌జాప్ర‌తినిధి మృతి చెందారు. ప్ర‌జాప్ర‌తినిధి వైర‌స్‌తో మ‌ర‌ణించ‌డం ఇదే తొలిసారి. ఆ రికార్డును ఈ జిల్లా న‌మోదు చేసింది.

సంగారెడ్డి మున్సిపాలిటీలో ఓ మ‌హిళా కౌన్సిల‌ర్‌కు వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో జూన్ 30వ తేదీ హైద‌రాబాద్‌లోని ఛాతీ ఆస్ప‌త్రికి చేరుకుంది. ఆమెకు ప‌రీక్ష‌లు చేయ‌గా జూలై 3వ తేదీన పాజిటివ్ అని తేలింది. ఆమె ప‌రిస్థితి విష‌మించింది. దీంతో వెంట‌నే గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె చికిత్స పొందుతూనే సోమ‌వారం మృతి చెందింద‌ని సంగారెడ్డి జిల్లా అధికారులు ప్ర‌క‌టించారు.

ఆమె ద్వారా ఆమె కుమారుడికి కూడా వైర‌స్ వ్యాపించింది. ప్ర‌స్తుతం అత‌డు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విష‌యం ఆమె కుటుంబ‌స‌భ్యుల‌ను 14మందిని హోం క్వారంటైన్‌కు త‌ర‌లించారు. వారికి ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు స‌మాచారం. సంగారెడ్డి ప‌ట్ట‌ణంలో ఒక త‌హ‌సీల్దార్‌కు, ఆమె భార్య‌కు కూడా పాజిటివ్ తేలింది. దీంతోపాటు ఒక జాతీయ బ్యాంక్ మేనేజ‌ర్‌కు కూడా వైర‌స్ సోకింద‌ని తెలుస్తోంది. ఈ విధంగా సంగారెడ్డి జిల్లాలో వైర‌స్ దారుణంగా విజృంభిస్తోంది.