ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి.. ఏం చేసిందో తెలుసా?

Mon May 03 2021 13:00:01 GMT+0530 (IST)

A woman committed a facebook crime

సోషల్ మీడియాలో సొల్లు బ్యాచ్ తోపాటు.. లూటీ చేసే బ్యాచ్ కూడా పెరిగిపోయింది. ఆ బ్యాచ్ లోని ఓ సభ్యురాలు ఏం చేసిందో చూద్దాం రండి. ఆడవాళ్లంతా మల్లె పువ్వులు అనుకోవడానికి లేదు.. కంచు కరోడాలు కూడా ఉంటారు. అలాంటి ఓ కిలేడీ.. తన దోపిడీకి ఫేస్ బుక్ ను మార్గంగా ఎంచుకుంది.ఖమ్మం జిల్లాకు చెందిన ఆ కిలేడీ పెళ్లి సంబంధాలు చూస్తానంటూ బయల్దేరింది. నిజానికి పెళ్లి సంబంధాల్లేవు ఏమీ లేవు. ఆ పేరు పెట్టుకొని ఫేస్ బుక్ మీద పడిపోయింది. ఆడవాళ్లు రిక్వెస్ట్ పెడితే.. ముందూ వెనకా ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసే మగానుభావులు కోకొల్లలు. అలాంటి వారితో.. చాటింగులు చేస్తూ దగ్గరవుతుంది. ఎవరైనా మూవ్ అయినట్టు అనిపిస్తూ.. ముగ్గులోకి దించే కార్యక్రమం మొదలు పెడుతుంది. ఇదీ.. ఆమె డైలీ లైఫ్.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని ఇదే విధంగా ట్రాప్ చేసింది. చివరకు ఎక్కడికి తీసుకెళ్లిందంటే.. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడే వరకూ తీసుకెళ్లింది. ఇంకేముందీ..? ఆ తర్వాత.. మీ వీడియో రికార్డు చేశానని డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. ఇలా.. ఒకటీ రెండు కాదు ఏకంగా రూ.4.50 లక్షల వరకు వసూలు చేసిందట. ఈ బాధ తట్టుకోలేక.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. రంగంలోకి దిగిన పోలీసులు.. చివరకు కిలేడీని గుర్తించారు.

ఆ తర్వాత తేలింది ఏమంటే.. ఈమె బాధితులు ఒకరిద్దరు కాదు చాలా మందే ఉన్నారు. వారి నుంచి కూడా అందిన కాడికి దోచేసిందట. అంతేకాదు.. వీళ్లలో కొందరి ఫొటోలను అమ్మాయిల తల్లిదండ్రులకు పంపించి తాను మ్యారేజ్ బ్యూరో నడుతుపుతున్నానని చెప్పిందట. పెళ్లి సంబంధం కుదిరిస్తానని చెప్పి వాళ్ల దగ్గర్నుంచి కూడా డబ్బులు దొబ్బేసిందట. మరికొందరు అబ్బాయిలకు ప్రేమిస్తున్నానని కలరింగ్ ఇచ్చిందట. ఈ ఘరానా లేడీపై కూకట్ పల్లి ఘట్ కేసర్ ఖమ్మం సత్తుపల్లి వంటి చోట్ల పోలీసు కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయట!

అదన్నమాట సంగతి. అందుకే.. ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్ వెనుక ఏ ముఖం ఉందో తెలియదు కాబట్టి.. ఎవరికి బడితే వాళ్లకు యాక్సెప్టులు చేయకండి. అవసరం లేని దోస్తానాలు మనకెందుకు చెప్పండి? అసలే రోజులు బాగాలేవు!