Begin typing your search above and press return to search.

కల్నల్ సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు

By:  Tupaki Desk   |   18 Jun 2020 7:10 AM GMT
కల్నల్ సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు
X
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీ వద్ద జూన్ 15న అమరవీరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు లభించింది. చైనా దళాలతో పోరాడి అమరుడైన ఆయన భౌతిక కాయానికి భారీ సంఖ్యలో ప్రజలు, నాయకులు తరలివచ్చి నివాళులర్పించారు. ఆయన అంతిమయాత్రలో వేలసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఉద్వేగభరితమైన వాతావరణ అంతిమయాత్రలో నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రజలు జాతీయ జెండాలు పట్టుకొని "వీరుదా వందనం" "సంతోష్ బాబు అమర్ హై" వంటి నినాదాలతో హోరెత్తించారు. కల్నల్ సంతోష్ బాబు శవపేటిక సూర్యపేట వీధుల గుండా వెళ్ళింది. ఆర్మీ సిబ్బంది కల్నల్ సంతోష్ మృతదేశాన్ని హైదరాబాద్ నుంచి అంబులెన్స్‌లోని సూర్యపేటలోని తన నివాసానికి తీసుకువచ్చారు. సంతోష్ బాబుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి కన్నీటి స్వాగతం పలికారు.

కుటుంబం, స్నేహితులు, బంధువులు నివాళులు అర్పించిన అనంతరం 5 కిలోమీటర్ల పొడవైన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.ఊరేగింపులో ప్రతీచోట కల్నల్ సంతోష్ ఫొటోలు, ప్లెక్సీలతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. కల్నల్ సంతోష్ బాబుకు బీహార్ రెజిమెంట్ ఆర్మీ పాల్గొని ఆయన అంత్యక్రియలను నిర్వహించింది. గార్డ్ ఆఫ్ ఆనర్ ను ప్రదర్శించింది. అంత్యక్రియలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యాయి. స్థానిక జనాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంత్యక్రియలు ర్యాలీ తర్వాత సంతోష్ బాబు మృతదేహం సూర్యపేట పట్టణం నుంచి 5.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతడి వ్యవసాయం స్థలం వద్దకు చేరింది.

అంతకుముందు హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో కల్నల్ సంతోష్ బాబుకు పలువురు ప్రముఖులు, తెలంగాణ గవర్నర్ తమిళై, మంత్రులు కెటిఆర్, మల్లారెడ్డి, ఇంకా పలువురు నివాళులు అర్పించారు. సంతోష్ భార్య ఆయన మృతదేహంపై దండలు వేసి కన్నీటి పర్యంతం అయ్యింది. అతడి మృతదేహాన్ని ఆర్మీ సిబ్బంది ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో తన స్వస్థలమైన సూర్యపేటకు తరలించారు.

అంతకుముందు సంతోష్ బాబు పార్థీవదేహానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, సైదిరెడ్డి సహా అనేకమంది నివాళులర్పించారు.