Begin typing your search above and press return to search.

2036 నాటికి... భారత జనాబా152 కోట్ల పైమాటే

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:00 PM GMT
2036 నాటికి... భారత జనాబా152 కోట్ల పైమాటే
X
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇప్పటికే రెండో స్థానాన్ని అధిష్ఠించిన భారత్... మున్ముందు మరింత మేర జనాభా కలిగిన దేశంగా కొనసాగనుంది. ఓ రకంగా చెప్పాలంటే దేశంలో జనాభా విస్ఫోటం కొనసాగుతోందని చెప్పక తప్పదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఓ సర్వే ప్రచారం... వచ్చే 16 ఏళ్లలో దేశ జనాభా ఏకంగా 152 కోట్లకు పైగా చేరే అవకాశాలున్నాయట. అంతేనా... దేశ రాజధాని డిల్లీలో ఈ 16 ఏళ్లలోనే ఏకంగా 98 శాతం మేర జనాభా పెరగనుందట. ఇక మిగిలిన రాష్ట్రాల్లోనూ 10 నుంచి 30 శాతం మేర జనాభా పెరగనుందట. కాస్తంత ఆందోళన కలిగించేలానే ఉన్న ఈ సర్వేలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధులు, పలు స్వతంత్ర సంస్థలకు చెందిన ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం దేశ జనాభా 138 కోట్లుగా ఉంటే... అది రానున్న 16 ఏళ్లలో అంటే... 2036కు ఏకంగా 152.2 కోట్లకు చేరుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి.

- 2011లో 121.1 కోట్లుగా ఉన్న దేశ జనాభా 2036 నాటికి ఏకంగా 152.2 కోట్లకు పెరగనుంది. అంటే.. ఏడాదికి 1 శాతం చొప్పున 25 ఏళ్లలో 25.7 శాతం మేర జనాభా పెరుగుతుందట. మొత్తంగా ఈ కాలంలో దేశంలో ఏకంగా 31.1 కోట్ల మేర జనాభా పెరుగుతుందట.
- ఫలితంగా ప్రస్తుతం చదరపు కిలో మీటర్ కు 368గా ఉన్న జన సాంద్రత 2036 నాటికి ఏకంగా 463కు పెరుగుతుందట.
- రానున్న 16 ఏళ్లలో పనిచేసే వయస్సున్న యువత (15-59 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు) సంఖ్య పెరుగుతుందట. 2036 నాటికి వీరి సంఖ్య 20.9 కోట్లకు చేరుతుందట.
- పనిచేసే వయస్సున్న యువతతో పాటు వృద్ధుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుందట. 2011లో వృద్ధుల సంఖ్య 10 కోట్లుగా ఉంటే... అది 2036 నాటికి 23 కోట్లకు చేరుతుందట. అంటే.. 2011లో వృద్ధుల శాతం 8.4 శాతంగా ఉంటే... అది కాస్తా 2036 నాటికి ఏకంగా 14.9 శాతానికి పెరుగుతుందట. ఫలితంగా మరణాల రేటు కూడా అదే రీతిన పెరుగుతుందట.
- సంతానోత్పత్తిలో తగ్గుదల కారణంగా ఈ 16 ఏళ్ల కాలంలో 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారి శాతం ప్రస్తుతమున్న 30.9 శాతం నుంచి 20 శాతానికి పడిపోతుందట.
- దేశంలో 24 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సున్న వారి శాతం 2011లో సగానికి పైగా అంటే.. 50.2 శాతం ఉంటే... 2036 నాటికి అది ఏకంగా 35.3 శాతానికి పడిపోతుందట.
- ఇక జనాభా పెరుగుదలలో అన్ని రాష్ట్రాల కంటే కూడా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా నమోదవుతుందట. ఢిల్లీ-ఎన్ సీఆర్ పరిధిలో ఈ 16 ఏళ్ల కాలంలో ఏకంగా 98 శాతం మేర జనాబా పెరుగుతుందట.
- ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పంజాబ్, మణిపూర్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లలో 10 నుంచి 20 శాతం మేర జనాభా పెరుగుదల నమోదు అవుతుందట.
- గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాగాల్యాండ్, ఉత్తరప్రదేశ్, మిజోరం, పుదుచ్ఛేరి, మేఘాలయ, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూల్లో ఏకంగా 30 శాతం మేర జనాభా పెరుగుతుందట.
- ఈ 16 ఏళ్లలో పెరిగే 31.1 కోట్ల జనాభాలో ఏకంగా సగానికి పైగా 17 కోట్ల జనాభా ఒక్క బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ లలో మాత్రమే పెరగనుందట. అంటే మొత్తం జనాభా పెరుగుదలలో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 50 శాతం మేర పెరుగుదల నమోదవుతుందట.