ఓ వింత ప్రేమకథ.. 11 ఏళ్ల క్రితం అదృశ్యం.. రహస్యంగా కాపురం!

Thu Jun 10 2021 18:00:01 GMT+0530 (IST)

A strange love story .. Disappeared 11 years ago .. Secretly a dove!

ప్రేమ గుడ్డిది అంటారు కొందరు. ప్రేమలో ఉంటే ఏం తెలియదు అంటారు మరికొందరు. ప్రేమ కోసం ఏదైనా చేస్తారు ఇంకొందరు. ఇలాంటి ప్రేమకోసమే ఓ యువతి ఏకంగా పదేళ్లపాటు బయట ప్రపంచానికి తెలియకుండా బతికింది. కనీస అవసరాలైన బాత్ రూం వసతి లేని గదిలో ఆ యువతి ప్రియుడి కోసం గడిపింది. ఈ వింత ప్రేమ కథ తాజాగా బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే...కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్మర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి 2010లో ఇంటి నుంచి పారిపోయింది. ఆమె కోసం ఎంత గాలించినా ఫలితం లేదని తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులనాశ్రయించినా ఆచూకీ లభ్యం కాలేదు. అప్పుడు ఆమె వయసు 18 ఏళ్లు. పదేళ్లు దాటడంతో ఆ యువతిని అంతా మర్చిపోయారు. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె సరాసరి ప్రియుడి ఇంటికి వెళ్లింది.

ప్రియుడి ఇంట్లో తాళం వేసి ఉన్న గదిలో ఆమె తలదాచుకుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు గడిపింది. రాత్రి వేళలో ఎవరు లేని సమయంలో ఆమె ప్రియుడు ఆహారం తీసుకొస్తే తినేది. అప్పుడే బయటకు వచ్చి ఇతర పనులు చేసుకునేది. ఆమె అవసరాలన్నీ ప్రియుడే తీర్చేవాడు. అలా పదేళ్ల పాటు సాగిన ఈ రహస్య ప్రేమ గాథ ఇటీవల బయట పడింది. ఆ యువకుడికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు ఒత్తిడి తేవడంలో ప్రియురాలితో కలిసి బయటకు వెళ్లిపోయాడు ఆ యువకుడు.

చీకటి గదిని వదిలేసి ఇద్దరూ ఓ గ్రామంలో సహజీవనం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ యువకుడి సోదరుడి కంటబడ్డారు. కుటుంబ సభ్యులు పోలీసుల ద్వారా అసలు విషయంపై ఆరా తీశారు. కాగా యువతి రహస్య ప్రేమ కథను వివరించాడు. ఆ యువతి తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వీరి పెళ్లికి కోర్టు అంగీకరించింది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది.