అత్త అల్లుడ్ని చంపేసింది.. ఈ క్రైంలో మలుపులెన్నో..

Fri Oct 30 2020 13:40:08 GMT+0530 (IST)

A shocking turn in the murder

మోజు.. కసిగా చంపే వరకు వెళ్లిన దారుణమైన క్రైం ఉదంతంగా దీన్ని చెప్పాలి. అక్రమ సంబంధంతో వచ్చే తిప్పలు.. మనుషుల మనస్తత్వాల్లో వస్తున్న మార్పులకు నిదర్శనంగా ఈ దారుణ ఉదంతాన్ని చెప్పక తప్పదు. క్యాటరింగ్ ఇద్దరిని కలిపితే.. అత్యాశ.. దుర్మార్గపు బుద్ధి వారి జీవితాల్ని చిందరవందరగా మార్చింది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున మరణాలకు వేదికగా మారింది.కొద్ది వారాల క్రితం ఒక వార్త చాలామందిని ఆకర్షించింది. పెళ్లి అయిన రెండు నెలలకే కొత్త వధువు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. దీనికి కారణం.. తన భర్తకు.. తన తల్లికి మధ్యనున్న అక్రమ సంబంధమని వేదన చెందుతూ.. బాధితురాలు తన ప్రాణాల్ని తీసుకుంది. కట్ చేస్తే.. గురువారం ఉదయం రామాంతపూర్ లో అల్లుడ్ని అత్త దారుణంగా చంపేసిన ఉదంతం బయటకు వచ్చి సంచలంగా మారింది. ఈ రెండింటి మధ్య ఏం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

మీర్ పేటకు చెందిన 38 ఏళ్ల అనితకు.. బాబూరావు అనే వ్యక్తితో ఇరవై ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి. కొడుకు పుట్టాక భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. క్యాటరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన 32 ఏళ్ల నవీన్ తో అనితకు పరిచయమైంది. అది కాస్త చనువుగా మారింది. ఇంటికి తరచూ వచ్చి పోతుండేవాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం వివాహేతర సంబంధంగా మారింది.

తమ సంబంధాన్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు వీలుగా.. దుర్మార్గమైన ప్లాన్ వేశారు. తన పెద్ద కుమార్తె వందనను ఇచ్చి గత ఏడాది నవీన్ కు ఇచ్చి పెళ్లి చేసింది. వివాహం జరిగిన తర్వాత వీరి అక్రమ సంబంధం గురించి తెలిసిన వందన.. తల్లిని పలుమార్లు హెచ్చరించినా.. వారిలో మార్పు రాలేదు. దీంతో ఆమె మార్చి 13న సూసైడ్ చేసుకుంది. ఈ ఉదంతంలో అనిత.. నవీన్ ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. మూడు నెలల తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక అనిత.. తన నివాసాన్ని సికింద్రాబాద్ లోని పార్శిగుట్టకు మార్చింది.

నవీన్ విజయవాడకు వెళ్లిపోయాడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించేవాడుకాదు. దీంతో.. వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇదిలా ఉండగా.. అతడు రామాంతపూర్ లో ఉంటున్న విషయాన్ని గెలుసుకున్న ఆమె.. బుధవారం రాత్రి అతడి వద్దకు వెళ్లింది. తనను దూరం ఎందుకు పెడుతున్నట్లు? అని నిలదీసింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అది కాస్తా గొడవగా మారింది. దీంతో.. నవీన్ ను అంతం చేయాలని నిర్ణయించిన ఆమె.. మామూలుగా ఉంటూ అతడితో పాటే ఆ రాత్రి ఉండిపోయింది. నిద్రలోకి జారిన నవీన్ ను కూరగాయల్ని తరిగే పాత కత్తితో అతి దారుణంగా చంపేసింది.  పదహారుచోట్ల విచక్షణ రహితంగా పొడిచేసిన ఆమె తర్వాత అక్కడే నిద్రపోయింది. ఉదయాన్నే ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. పోలీసులకు లొంగిపోయింది. మోజు.. మోసం.. చివరకు రెండు ప్రాణాలు పోవటమే కాదు.. రెండు కుటుంబాలు దారుణంగా ప్రభావితమయ్యాయని చెప్పక తప్పదు.