వైరస్‌పై నిర్లక్ష్యం చేశాడు ప్రాణమే పోయింది..

Sat Jul 11 2020 16:00:22 GMT+0530 (IST)

Ignoring the virus is lifeless ..

వైరస్ భయంతో ప్రజలు ఏ చిన్న అనారోగ్యం ఉన్నా భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్లలేకపోతున్నారు. దీంతో వైరస్ లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోవడానికి సాహసించడం లేదు. ఒకవేళ లక్షణాలు ఉన్నా దాచుకుంటున్నారు. అయితే అదే వారు చేసే పెద్ద తప్పు. వారు చికిత్స పొందకపోవడంతో ఇతరులకు వ్యాపించడంతో పాటు వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో వారి ప్రాణపాయానికి వస్తుంది పరిస్థితి. ఆ విధంగా ఒక వ్యక్తి వైరస్ లక్షణాలు ఉన్నా తీవ్ర నిర్లక్ష్యం చేశాడు.. లక్షణాలు ఉన్నా కుటుంబసభ్యులకు చెప్పకుండా కప్పిపుచ్చుకుని చివరకు మృతిచెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దేవాంగ వీధికి చెందిన ఫ్యాన్సీ వ్యాపారి (58) పది రోజులుగా దగ్గు జ్వరంతో బాధపడుతున్నాడు. ఇది గమనించిన అతడి భార్య పరీక్షలు చేసుకో.. ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోమని ఒత్తిడి తెచ్చింది. కొన్ని రోజులు వినలేదు. చివరకు పరిస్థితి క్షీణించింది. అన్తరం రెండు మూడు ప్రైవేటు ఆస్పత్రులకు వైద్యం కోసం వెళ్లగా అక్కడ వైద్యం చేయలేమని నిరాకరించారు. దీంతో చివరకు భార్య వార్డు వలంటీర్‌కు సమాచారం ఇచ్చింది. వైద్య సిబ్బంది వచ్చి అతడిని పరీక్షించి వైరస్ లక్షణాలేనని తేల్చిచెప్పారు. ఐదు రోజుల కిందట భార్యాభర్తలకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైరస్ పరీక్ష చేశారు. రిపోర్టు వచ్చిన తర్వాత చెబుతామని వారిని ఇంటికి పంపించారు. అయితే రిపోర్టు రాక మునుపే అతడి పరిస్థితి విషమించింది. గురువారం ఉదయం అతడికి దగ్గు ఊపిరి సమస్య జ్వరం పెరగడంతో పాటు విరేచనాలు కూడా అధికమయ్యాయి.

ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అతడి పరిస్థితి విషమించి ప్రభుత్వ ఆస్పతికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించి టెస్ట్ చేయగా.. ఆ రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో శుక్రవారం ఉదయం మృతదేహానికి మున్సిపాలిటీయే అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది. మృతుడి ఇల్లు ఉన్న దేవాంగుల వీధిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించింది.