వామన్ రావు నా భర్తను చంపాడు’ మీడియా ముందుకొచ్చిన బాధితురాలు..!

Mon Feb 22 2021 11:22:27 GMT+0530 (IST)

A new angle in the Vaman Rao case

న్యాయవాద దంపతులు వామన్రావు ఆయన భార్య ఇటీవల నడిరోడ్డు మీద హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుంట శ్రీను బిట్టు శ్రీను మరికొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్యలో అధికార పార్టీకి చెందిన ఓ నేత హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంటే వామన్రావు తన భర్తను హత్య చేశాడంటూ ఓ మహిళ మీడియా ముందుకు వచ్చింది. నల్లవెల్లి అరుణజ్యోతి అనే ఓ మహిళ సంచలన విషయాలను బయటపెట్టారు.



కరీంనగర్ లో ఆమె మీడియా సమావేశంలో ఏం చెప్పిందటే.. ‘నా భర్త వెంకటేశ్వర్లు ఇరిగేషన్శాఖలో పనిచేసేవారు. ఆయనను ఇటీవల హత్యకు గురైన వామన్రావు హత్య చేశాడు. 2008లో నా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 1.50 లక్షలు తీసుకొని వామన్రావు  మోసం చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో  కరీంనగర్ అల్గునూర్ వద్ద నా భర్తను కిడ్నాప్ చేసి నల్లగొండ జిల్లా వెలిగొండ గ్రామంలో హత్య చేశాడు.

ఆ  హత్యపై అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. హోంమంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి విషయం చెప్పాను అయినా న్యాయం జరగలేదు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వామన్రావు బాధితులు చాలా మంది ఉన్నారు. ఇప్పడిప్పుడే వాళ్లంతా బయటకు వస్తున్నారు.’ అంటూ ఆమె చెప్పారు. అయితే ఓ వైపు పోలీసులు ఈ జంట హత్యల కేసులను విచారిస్తున్న సందర్భంలో ఓ మహిళ మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది.