గ్రహాంతరవాసులు.. ఈ పదం తరచుగా సైన్స్ ఫిక్షన్లలోనూ సినిమాల్లో చూడటమే తప్ప నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నారని నిర్ధారణగా చెప్పేవారు ఎవరూ లేరు. అయితే అప్పడప్పుడు గ్రహాంతరవాసులపై వార్తలు వస్తుంటాయి. నాసా విడుదల చేసే కొన్ని ఛాయాచిత్రాల్లో కనిపించే వింతరూపాలను గ్రహాంతరవాసులేనంటూ పలువురు భావిస్తుంటారు. గ్రహాంతరవాసులు ఉన్నారని.. వారు అప్పుడప్పుడు భూమిమీదకు వస్తుంటారని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నారు.
మనదేశంలోనే కాక
అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లోనూ గ్రహాంతరవాసులపై పలు కథలు
వ్యాప్తిలో ఉన్నాయి. ఓ గ్రహాంతరవాసి ఆధారంగా చేసుకొని మనవద్ద ‘పీకే’ అనే
సినిమా కూడా వచ్చింది. ఈ చిత్రం మనవద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాక..
విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. అయితే ప్రస్తుతం అమెరికాలోని యుటాలోని
రెడ్‌రాక్ ఎడారిలో ఓ లోహస్తంభం బయటపడింది. ఈ స్తంభం అక్కడికి ఎలా
వచ్చింది? ఎవరు తీసుకొచ్చారో తెలియట్లేదు. అంగారక గ్రహంపైనే ఇటువంటి
వస్తువులు ఉంటాయని అంతరిక్షపరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడీ
నిర్మాణం రెడ్‌రాక్ ఎడారిలో కనిపించడం చర్చనీయాంశం అయ్యింది.
గ్రహాంతరవాసులు
ఉన్నారని నమ్మే కొంతమంది ఇవీ గ్రహాంతరవాసులే తెచ్చి ఇక్కడ పెట్టారని
వాదిస్తున్నారు. దీనిమీద అమెరికా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ
స్తంభం స్టీల్‌ను పోలిఉందని ఏకశిలలా ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు
అంటున్నారు. అమెరికాకు చెందిన వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఎడారిలో
జంతుగణన చేస్తుండగా ఈ వింతవస్తువు వారి కంటపడింది.
వెంటనే
హెలిక్యాప్టర్ దిగి ఆ వస్తువును పరిశీలించారు. ఈ స్తంభం 12 ఫీట్లు ఉందని
కొంతభాగం భూమిలో పాతిపెట్టి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి
వస్తువులు భూమిలో ఉండటం చాలా దుర్లభమని వారు అన్నారు. ఈ స్తంభాన్ని ఎవరన్నా
తీసుకొచ్చి ఇక్కడపాతారా.. చాలా కాలం నుంచి ఇది ఇక్కడే ఉందా? అన్న విషయంపై
పరిశోధనలు సాగుతున్నాయి.