కొత్త మోటార్ వాహనాల చట్టం 2019 కింద ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలానాలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తమ వాహనం విలువ కన్నా అధిక మోతాదులో బాదుతున్న ట్రాఫిక్ చలానాలు కొంతమంది వాహనదారులను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. దీనికి తోడు పెట్రోల్ మోత మోగిపోతుంది.
బంక్
వైపు చూడాలంటేనే భయమేస్తుంది. 100 దాటిన పెట్రోల్ ధరతో సామాన్యులు
అల్లాడిపోతున్నారు. పెట్రోల్ ధరలు ఇలా ఉంటే మరోవైపు ట్రాఫిక్ చాలనాలతో
వాహనదారులు అల్లాడిపోతున్నారు. భారీ ఫైన్స్ తో అల్లాడిస్తున్నారు
పోలీసులు. వాహనాలతో బయటకు వెళ్తే ఏ రూల్ కింద ఎంత చెల్లించాల్సి వస్తుందో
అని భయపడుతున్నారు.
అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి పోలీసులకే
షాక్ ఇచ్చాడు. ట్రాఫిక్ చలానా చెల్లించమన్నారనే ఆగ్రహంతో తన బైకును
తగలబెట్టేసి నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా
కేంద్రానికి చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన ద్విచ్రవాహనానికి
నిప్పంటించాడు. ఇప్పటికే వాహనంపై రెండు వేల రూపాయల జరిమానా చెల్లించానని..
ఇంకా చెల్లించాలంటూ పోలీసులు ఇబ్బందిని పెడుతున్నారని అతడు చెప్పుకొచ్చాడు.
దీంతో చలానాల భారం భరించలేక పంజాబ్ చౌక్ లో తన వాహనాన్ని
తగలబెట్టినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు స్థానికులు మంటలు ఆర్పే
ప్రయత్నం చేశారు. అప్పటికే బైక్ చాలా భాగం కాలిపోయింది. ఈ ఘటన స్థానికంగా
తీవ్ర కలకలం సృష్టించింది. ఈ తరహా ఘటనలు జరగడం ఇదే తొలిసారి ఏమీ కాదు.
ఇప్పటికే పలువురు బైక్స్ కి నిప్పు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.