నాటు కోళ్లతో కోట్లు సంపాదించొచ్చు.. ఎలానో అతడ్ని చూస్తే తెలుస్తుంది

Mon Nov 29 2021 15:00:01 GMT+0530 (IST)

A man Get Crores with hens

చదివే దానికి.. చేసే ఉద్యోగానికి సంబంధం లేదన్న విషయం తెలిసిందే. మనం ఏం చదివినా.. చేసే పని మాత్రం మనకు ఇష్టమైనదైతే ఆటోమేటిక్ గా విజయం మన సొంతమవుతుంది. ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తున్నాడు 26 ఏళ్ల గోమారంఅచ్యుత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరానికి 40 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండీగ్రామానికి చెందిన ఇతగాడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నాటు కోళ్లను పెంచుతూ వ్యాపారం చేసే ఇతగాడు ఇప్పటికే లక్షలాది రూపాయిలు సంపాదిస్తున్నాడు. అంతేనా.. త్వరలో కోట్లు కొల్లగొట్టటానికి ఇతగాడి వద్ద భారీ ప్లాన్ రెఢీగా ఉంది.ఇంతకీ ఇంతటి టర్నోవర్ ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. అతడి జర్నీని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. దాదాపు ఆరేళ్ల క్రితం 5వేల కోళ్లను పెంచటం షురూ చేశాడు. మధ్యలో బ్రోకర్ల ప్రమేయం ఉండకూడదన్న ఉద్దేశంతో సొంతంగా న్యూట్రీఫ్రెష్.. ఎపీక్యూర్ అనే బ్రాండ్లతో గుడ్లు.. మాంసం అమ్మకాల్ని మొదలు పెట్టాడు.

తన వ్యాపార ప్రచారానికి వాట్సాప్.. ఇన్ స్టా.. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఉపయోగించాడు. బుధ.. శుక్ర.. ఆదివారాల్లో ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే.. ఇంటికే తీసుకొచ్చి డెలివరీ చేసేలా ప్లాన్ చేశాడు. ప్రతి నెల 1500 కేజీల మాంసం.. దాదాపు 10 లక్షల గుడ్లను సరఫరా చేస్తున్నాడు.

250 మంది రైతులతో ఒప్పందం చేసుకున్నాడు. వారు సరఫరా చేసే మాంసానికి తన బ్రాండ్ పేరు పెట్టాడు. నాటు కోడిగుడ్లు.. వాటి మాంసానికి ఉండే డిమాండ్ ను తాను అందిపుచ్చుకున్నానని.. సొంత బ్రాండ్లతో వ్యాపారం చేయటం తనకు కలిసి వచ్చిందని చెబుతాడు.

గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల టర్నోవర్ చేసిన ఇతడు..ఈ ఏడాది రూ.10కోట్ల టర్నోవర్ ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంతకీఈ బిజినెస్ ఎలా వర్కువుట్ అవుతుందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర విషయాల్ని చెప్పుకొస్తాడు. కోళ్ల వ్యాపారంలో అవగాహన.. అభిరుచి చాలా ముఖ్యమని.. ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా తీవ్రంగా నష్టపోవటం ఖాయమని చెబుతాడు.

5వేల నాటుకోళ్ల కోసం షెడ్డు ఏర్పాటు చేయటానికి దాదాపు ఏడు లక్షల రూపాయిలు ఖర్చు అవుతుందని.. కోళ్లు సహజ వాతావరణంలో తిరిగేందుకు ఎకరా నుంచి మూడు ఎకరాల వరకు స్థలం అవసరమని చెబుతాడు. ఒక్కో కోడిపిల్ల రూ.20 నుంచి రూ.40 వరకు ఉంటుందని.. 5వేల పిల్లల్ని కొనేందుకు.. వాటిని కనీసం 90 -100 రోజులు పెంచేందుకు రూ.9లక్షల ఖర్చు అవుతుందని చెబుతాడు.

అప్పటికి ఒక్కొక్క కోడి కేజిన్నర బరువు వస్తుందని.. దాంతో మొత్తం కోళ్లు 8500 కేజీలు అవుతాయని.. మార్కెట్లో లైవ్ కోడి కేజీ రూ.180 చొప్పున అమ్మినారూ.15 లక్షలు వస్తాయని.. రెండో విడత నుంచి పెట్టుబడి తిరిగి రావటమేకాదు.. భారీగా లాభాలు రావటం ఖాయమంటాడు. చదివినంతనే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ.. చాలా కష్టంతో కూడుకున్నది. కానీ.. ఇష్టం ఉంటే.. ఈ కష్టం పెద్దగా అనిపించదు.