Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసు: పీఏను ప్రశ్నిస్తున్న సీబీఐ

By:  Tupaki Desk   |   16 Jun 2021 10:30 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసు: పీఏను ప్రశ్నిస్తున్న సీబీఐ
X
2019 మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ తేలడం లేదు. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వస్తూనే ఉన్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి.

ఒక్కరిని విచారిస్తే మరో కొత్త క్లూ అన్నట్టుగా మరొకరికి లింకు పెడుతూ సీబీఐ విచారణ విస్తృతంగా సాగుతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వరుసగా పదోరోజు కూడా విచారణ జరిపారు. ఇప్పటికే వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితో పాటు వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్, రవాణాశాఖ సిబ్బందిని విచారించిన సీబీఐ అధికారులు ఈరోజు వైఎస్ వివేకా పీఏను ప్రశ్నించారు.

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పదోరోజు కూడా సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం వసతి గృహంలో సీబీఐ విచారణ చేస్తుండగా.. ముగ్గురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

చిట్వేలికి చెందిన లక్ష్మీకర్, రమణ, సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది. గతంలో జగదీశ్వర్ రెడ్డి హత్యకు గురైన వివేకాకు పీఏగా పనిచేశారు. దీంతో ఆయనను విచారిస్తున్నారు.

వివేకా హత్య జరిగే ముందురోజు కొన్ని అనుమానిత వాహనాలు, రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాహనాలు ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగినట్లు సీబీఐ అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఆ వాహనాల వివరాలను ట్రాన్స్ పోర్టు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వీరు ఇచ్చిన సమాచారమే ఈకేసులో కీలకంగా మారనుందని సమాచారం.