Begin typing your search above and press return to search.

టీమిండియాకు పెద్ద షాక్.. ప్రపంచకప్ నుంచి బుమ్రా ఔట్?

By:  Tupaki Desk   |   29 Sep 2022 2:30 PM GMT
టీమిండియాకు పెద్ద షాక్.. ప్రపంచకప్ నుంచి బుమ్రా ఔట్?
X
ఇప్పటికే మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరమై ఆసియాకప్ లో ఘోరంగా ఓడిన టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. టీమిండియా ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో జట్టుకు దూరం అయినట్టు తెలిసింది. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ ఇది టీమిండియాకు అతిపెద్ద షాక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

టీమిండియా బౌలింగ్ దళాన్ని నడిపేది బుమ్రానే. అతడి యార్కర్లతో డెత్ ఓవర్లలో భారత్ ను గెలిపించగలడు. అయితే వెన్నునొప్పితో బాధపడుతున్న అతడిని ఆసియా కప్ లో ఆడించలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లోనూ దించలేదు.రెండో, మూడో మ్యాచ్ లలో ఆడించగా వెన్నునొప్పి తిరగబెట్టినట్టు తెలిసింది. అందుకే దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ లో బుమ్రా ను జట్టులోకి తీసుకోకుండా విశ్రాంతినిచ్చారు.

వెన్నునొప్పి తగ్గకపోవడంతో సిరీస్ లోని మిగతా మ్యాచ్ లతోపాటు టీ20 ప్రపంచకప్ నకూ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు బుమ్రా వెళ్లకపోవచ్చు. అతడికి వెన్నునొప్పి ఉంది. కనీసం ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు తెలిపారు. అయితే బీసీసీఐ దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఆసియాకప్ లో టీమిండియా ఓటమికి డెత్ ఓవర్లలో బౌలింగ్ వైఫలయ్యమే కారణం. బుమ్రా, హర్షల్ పటేల్ లాంటి డెత్ ఓవర్ యార్కర్ కింగ్ లు లేక పాకిస్తాన్, శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఇప్పుడు ప్రపంచకప్ వరకైనా బుమ్రా ఉంటాడనుకుంటే మరో భారీ దెబ్బతగిలింది.

బుమ్రా లేకపోతే ఖచ్చితంగా టీ20 ప్రపంచకప్ లో భారత్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది. భువనేశ్వర్ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇస్తున్నాడు. పేస్ కు సహకరించే ఆసీస్ పిచ్ లపై బుమ్రా చెలరేగుతాడని అందరూ ఆశించారు. బుమ్రా లేకపోతే టీంకు తీవ్ర నష్టం తప్పదు. ఇప్పటికే రవీంద్ర జడేజా లేక జట్టు సమతుల్యం దెబ్బతిన్నది. ఇప్పుడు బుమ్రా కూడా లేకపోతే మరిన్ని కష్టాలు తప్పవు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.