కోట్లున్న బిచ్చగాడు.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Fri Dec 02 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

A beggar with crores

మనలో చాలా మంది ‘బిచ్చగాడు’ సినిమా చూసే ఉంటారు. ఈ మూవీలో హీరో తల్లి ఆరోగ్యం బాగుపడేందుకు ఓ స్వామిజీ ఇచ్చిన సలహాతో హీరో నెలరోజులు బిచ్చగాడిగా మారతాడు. వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ బిచ్చగాడి జీవితం గడపాల్సి వస్తుంది. అయితే అతడు ఎందుకలా చేస్తాడో చివరకు హీరోయిన్ కు తెలుస్తుంది. దీంతో అతడిపై ప్రేమ మరింత ఎక్కువై చివరకు పెళ్లితో సినిమాకు ఎండ్ కార్డు పడుతుంది.అయితే ఇప్పుడు చెప్పబోయేది తెలుగు సినిమా ‘బిచ్చగాడు’ స్టోరీకి పూర్తి రివర్స్.. కోట్లల్లో ఆస్తులు.. లక్షల్లో రెంటల్ ఆదాయం వస్తున్నప్పటికీ ఓ వ్యక్తి మాత్రం భిక్షాటనను మాత్రం వదల్లేదు. ఆ వ్యక్తితో ఏదో మంచి పని కోసం భిక్షాటన చేయడం చేస్తున్నాడని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అసలు విషయానికొస్తే..!

బ్రిటన్ రాజధాని లండన్ లోని ఒక రోడ్డు పక్కన నిరాశ్రయిడిగా టామ్ అనే వ్యక్తి జీవిస్తున్నాడు. అయితే అతడిని టాబూ రూమ్ అనే మీడియా సంస్థ ఇంటర్వ్యూ నిర్వహించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బిచ్చగాడు ప్రతీరోజు 200 నుంచి 300 పౌండ్ల వరకు సంపాదిస్తున్నానని చెప్పాడు. తన భార్య పిల్లలకు ఐదు లక్షల పౌండ్ల విలువైన సొంత ఇల్లు ఉందని తెలిపాడు.

అంతేకాకుండా తనకు ఐదు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని.. వీటి ద్వారా నెలకు 1.27 లక్షల ఆదాయం అద్దె రూపంలో వస్తున్నట్లు తెలిపి టామ్ వివరించాడు. తన వ్యసనాల కారణంగా ఎక్కడ తన ఇంటిని సైతం అమ్మేయాల్సి వస్తుందోనన్న ఆవేదనను టామ్ వెలిబుచ్చడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మధ్యతరగతి ఇంట్లో పుట్టిన టామ్ క్రీడల ద్వారా వచ్చే స్కాలర్ షిప్ తో కళాశాలకు వెళ్లాడు. అయితే చెడు అలవాట్లకు బానిస కావడంతో అతడి లైఫ్ పూర్తిగా తలకిందులైందని చెప్పుకొచ్చాడు. 13 ఏళ్ల వయస్సు నుంచే డ్రగ్స్.. మద్యానికి అలవాటు పడి యుక్త వయస్సుకు వచ్చేసరికి హెరాయిన్ కు బానిసయ్యాడు.

ఈ వ్యసనాల నుంచి బయట పడేందుకు పునారావస కేంద్రాలకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఏడేళ్లు అలవాట్లకు దూరంగా ఉన్న టామ్ మళ్లీ వాటిని మానలేక జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు. ఇక తనకు నెలవారీగా వచ్చే ఆదాయంతో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ వ్యసనాన్ని మానుకో లేక పోతున్నానని దీని వల్ల ఎక్కడ తన ఇంటిని సైతం అమ్మేస్తాననన్న భయం నెలకొందని తెలిపాడు.

డ్రగ్స్ అలవాటు తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసిందని టామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. యుక్త వయస్సు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మనదేశంలోనూ అరుదుగా కోట్లలో సంపాదిస్తున్న బిచ్చగాళ్ల గురించి వార్తలు విన్పిస్తుంటాయి. ఏది ఏమైనా కోట్లలో సంపాదన ఉన్నప్పటికీ కొందరి జీవితాలు మాత్రం భిక్షాటనకే పరిమితం కావడం శోచనీయంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.