Begin typing your search above and press return to search.

నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే సృష్టించారు

By:  Tupaki Desk   |   11 July 2020 1:00 PM GMT
నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే సృష్టించారు
X
వీళ్లు ముదుర్లకే ముదుర్లు.. ఎందుకంటే ఎవరైనా బ్యాంకుకే కన్నమేస్తారు.. మోసం చేస్తారు. వేల కోట్ల అప్పులు తీసుకొని పరార్ అవుతారు. బ్యాంకును మోసం చేసిన ఘటికలు దేశంలో మాల్యా, నీరవ్ మోడీ, చోహ్లీ ఇలా చాలా మంది ఉన్నారు. కానీ బ్యాంకులపై మాత్రం ప్రజలకు పూర్తి నమ్మకం. అయితే ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా కొందరు అక్రమార్కులు మలుచుకున్నారు. ఏకంగా నకిలీ బ్యాంకునే పెట్టారు.

తమిళనాడులోని కడలూరు జిల్లా పన్ రూటీ లో ఏకంగా 3 నెలలుగా సాఫీగా ఓ నకిలీ ఎస్బీఐ బ్యాంచ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ బ్యాంక్ కు పనిమీద వెళ్లిన ఓ ఎస్బీఐ కస్టమర్ కు వీళ్ల వ్యవహారంపై అనుమానం వచ్చింది. తన సొంత బ్యాంకు మేనేజర్ కు దీనిపై ఫిర్యాదు చేశాడు.

వెంటనే సదురు ఎస్.బీ.ఐ బ్రాంచ్ మేనేజర్ ఉన్నతాధికారులకు ఈ నకిలీ బ్రాంచ్ పై సమాచారం ఇచ్చాడు. అక్కడ రెండు బ్రాంచులకే అనుమతి ఉందని.. ఇది నకిలీదని తేల్చారు. వెంటనే ఆ ఎస్బీఐ బ్రాంచ్ పై దాడి చేసి పరిశీలించగా అదంతా నకిలీదని తేలింది. కానీ సేమ్ అచ్చం ఎస్బీఐ ఫర్నీచర్ తో మౌలిక సదుపాయాలతో ఏకంగా నకిలీ బ్యాంకునే ఏర్పాటు చేయడం చూసి ఎస్బీఐ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వచ్చి వారు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ లో పనిచేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఈ ముగ్గురిలో ప్రధాన సూత్రధారుడు కమల్ బాబు గా గుర్తించారు. ఈయన తల్లి బ్యాంకు మాజీ ఉద్యోగి.. ఇటీవలే రిటైర్డ్ కావడంతో ఆమె స్పూర్తిగా ఈ దందా మొదలుపెట్టాడు. మరో వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవాడు కాగా.. మూడో వ్యక్తి రబ్బర్ స్టాంప్ లను తయారు చేసేవాడు. ఈ ముగ్గురు కలిసి ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే సృష్టించడం విశేషం.