Begin typing your search above and press return to search.

రూపాయి ఢ‌మాల్‌!! డాల‌ర్‌కు 80 రూపాయ‌లు.. మాంద్యం ఎఫెక్ట్‌!!

By:  Tupaki Desk   |   6 July 2022 8:30 AM GMT
రూపాయి ఢ‌మాల్‌!!  డాల‌ర్‌కు 80 రూపాయ‌లు.. మాంద్యం ఎఫెక్ట్‌!!
X
ప్ర‌పంచ దేశాల‌ను ఆర్థిక మాంద్యం భ‌య‌పెడుతోంది. ముఖ్యంగా భార‌త్‌లో ఈ ప‌రిస్థితి మ‌రింత దారుణం గా క‌నిపిస్తోంది. వారం వ్య‌వ‌ధిలో రూపాయి మారకం విలువ మ‌రింత ప‌డిపోయింది. మంగ‌ళ‌వారం నాటి అంచ‌నాల ప్ర‌కారం.. డాల‌ర్‌కు 79.36 రూపాయ‌లు చెల్లించే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఈ ప‌రిణామం మ‌రింత గా కొన‌సాగుతుంద‌ని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

దీనిపై కొటాక్ సెక్యూరిటీస్ ప‌రిశోధ‌న సంస్థ స్పందిస్తూ.. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ 80 రూపాయ‌ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేసింది. విస్తరిస్తున్న వాణిజ్య లోటు, వడ్డీ రేట్ల వ్యత్యాసాల తగ్గుదల, రిజర్వ్ బ్యాంక్ విదేశీ మారకపు నిల్వ‌ల‌ వ్యూహం(కొనుగోలు-అమ్మకాల మార్పిడితో పాటు అమ్మకం) ఫార్వర్డ్ ప్రీమియంల పతనానికి దారితీసిందని తెలిపింది. ఇటీవల రూపాయిలో సాపేక్షంగా తీవ్ర క్షీణతకు దారితీసిందని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది.

ప్ర‌పంచ స్థూల వాణిజ్యంలో అనిశ్చితి నెల‌కొంద‌ని పేర్కొంది. ముఖ్యంగా ముడిచమురు ధరలు పెరిగితే, ప్రపంచ వృద్ధి మందగిస్తే భారత రూపాయి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం 10 గ్రాములకు రూ.54,000కి చేరింది.

డాల‌రే దిక్కు?ప్ర‌పంచ దేశాల్లో నెల‌కొన్ని ఆర్థిక మంద‌గ‌మ‌నం నేప‌థ్యంలో పెట్టుబడులకు తక్షణ మార్గంగా డాలర్‌ కనబడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఫెడ్‌ కఠిన ద్రవ్య విధానంతో ప్రపంచవ్యాప్తంగా నిధులు డాలర్లలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక పతనం కొనసాగుతోంది.

ఒక దశలో రూపాయి 79.38 స్థాయిని కూడా చ‌వి చూసింది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కు మళ్లడం రూపాయి భారీ పతనానికి కారణమవుతోంది. ఈ రెండు స్థాయిలు రూపాయికి ముగింపు, ఇంట్రాడే కనిష్ట స్థాయిలు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ లాభాల బాటన పయనిస్తుండగా, నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 35 డాలర్లు పతనమై (2 శాతం) 1,767కు చేరింది. క్రూడ్‌ 10 శాతం వరకూ పడిపోయి 100 డాలర్ల దిగువకు చేరింది. మొత్తంగా ప్ర‌పంచ వ్యాప్తంగా మారుతున్న ఆర్థిక‌, రాజ‌కీయ ప‌రిణామాలు.. భార‌త రూపాయిని కుదిపేస్తున్నాయి.