Begin typing your search above and press return to search.

చెన్నై దరిద్రం.. హైదరాబాద్ కు విడతలవారీగా వచ్చేస్తుందట

By:  Tupaki Desk   |   10 Aug 2020 6:50 AM GMT
చెన్నై దరిద్రం.. హైదరాబాద్ కు విడతలవారీగా వచ్చేస్తుందట
X
అమ్మోనియం నైట్రేట్.. అందరికి సుపరిచితమైన రసాయనమే. కానీ.. అది మొన్నటి వరకు. ఎప్పుడైతే లెబనాన్ రాజధాని బీరుట్ షిప్ యార్డులో పేలుడు జరిగి.. విధ్వంసం ఎలా ఉంటుందో చూసిన తర్వాత కానీ.. ఈ ప్రమాదకర రసాయనంలో ఇంత డేంజర్ ఉందని. అంతే.. అప్పటికప్పుడు ప్రపంచ దేశాలు అలెర్టు అయిపోయాయి. ఈ రసాయనం పెద్ద మొత్తంలో ఎక్కడైనా నిల్వ ఉంచితే.. ఎలా ఉంచారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటూ యుద్ధ ప్రాతిపదికన చెక్ చేయటం షురూ చేశారు.

ఇదే క్రమంలో మన దేశంలోనూ.. ఈ ప్రమాదకరమైన రసాయనం గురించి ఆరా తీయగా.. రెండు ముఖ్యమైన అంశాల్ని గుర్తించారు. అందులో ఒకటి.. దేశానికి అవసరమైన ఈ రసాయనం మొత్తం వైజాగ్ షిప్ యార్డు నుంచి తరలిస్తారని.. రెండోది.. ఐదేళ్ల క్రితం కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ఈ రసాయనం అక్రమం కావటంతో దాన్ని చెన్నైకు సమీపంలో నిల్వ ఉంచారని. చెన్నైలో నిల్వ ఉంచిన రసాయనం ఎంతో తెలుసా? అక్షరాల 740 టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీలు). అది కూడా 37 కంటైనర్లలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

దీంతో.. వైజాగ్ వాసుల్లోనూ.. చెన్నై వాసుల్లోనూ కొత్త దడ మొదలైంది. తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. చెన్నైకు దగ్గర్లోని గోదాముల్లో దాచి ఉంచిన ఈ రసాయనాన్ని.. తాజాగా అక్కడ నుంచి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉంచటం భద్రతా పరమైన సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో.. వాటిని విడతల వారీగా హైదరాబాద్ కు తరలించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

దశల వారీగా ఈ ప్రమాదకరమైన రసాయనాన్ని తరలిస్తున్న వార్తలు రాగా.. తెలంగాణ వాసుల గుండెల్లో రైళ్లు పరిగెట్టటం ఖాయమని చెప్పక తప్పదు. రోజుకు పది కంటైన్లు చొప్పున నాలుగు విడతల్లో అక్కడున్న రసాయనం మొత్తాన్ని తెలంగాణకు తరలించాలన్న నిర్ణయం చూస్తే.. హైదరాబాద్ వాసుల గుండెల మీద కొత్త కుంపటి పెట్టినట్లై అవుతుందనన అభిప్రాయం వ్యక్తమవుతోంది.