తెలంగాణలో 6ఏఎం- 6పీఎం ఓపెన్.. కానీ ఆ ఊరు తప్ప

Thu Jun 10 2021 12:04:21 GMT+0530 (IST)

6 AM- 6 PM open in Telangana .. but except that town

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే..తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన రెండు వారాలుగా పరిస్థితుల్లో మార్పుకొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మొన్నటివరకు విపరీతమైన రద్దీతో ఉన్న ఆసుపత్రులు ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాయి. అంతేకాదు.. ఆసుపత్రుల్లో ఆడ్మిషన్ల కోసం బారులు తీరిన అంబులెన్సులు ఇప్పుడు అందుకు భిన్నంగా బోసిపోతున్నాయి. దీంతో.. వైద్యులు.. వైద్య సిబ్బంది కాస్తంత విశ్రాంతి తీసుకునే వీలు చిక్కింది. దీంతో.. తెలంగాణలో విధించిన లాక్ డౌన్ కు దశల వారీగా సడలింపులు ఇస్తున్నారు.ఈ రోజు నుంచి తెలంగాణలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా తెలంగాణలోని ఒక గ్రామంలో మాత్రం ఫుల్ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందంటే.. నల్గొండ జిల్లాలోని దండేపల్లిలో మాత్రం పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు.

దీనికి కారణం.. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి..దండేపల్లిలో మాత్రం కేసుల జోరు తగ్గకపోవటంతో.. ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే నిత్యవసర వస్తువుల కోసం లాక్ డౌన్ సడలిస్తున్నారు. అది మినహా మిగిలిన సమయమంతా ఎవరింట్లో వారు ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తమ గ్రామంలో కేసులు ఎంతకూ తగ్గకపోవటంతో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా గ్రామ సర్పంచ్ పుష్పా సైదులు చెబుతున్నారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

అంతేకాదు.. ఈ నెల 20 వరకు కూడా గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టకూడదన్న విషయాన్ని స్పష్టం చేశారు. కేసుల నమోదు తగ్గే వరకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు.. వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తున్నారు. అంతేకాదు.. తమ గ్రామస్తులు ఎవరూ కూడా తమ బంధువులు ఎవరిని గ్రామానికి రావొద్దని చెప్పాలని గ్రామ పంచాయితీ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.