Begin typing your search above and press return to search.

5జీతో ఆ ముప్పు ఎంత? ఎట్టకేలకు అమెరికాలో మొదలైంది

By:  Tupaki Desk   |   20 Jan 2022 3:36 AM GMT
5జీతో ఆ ముప్పు ఎంత? ఎట్టకేలకు అమెరికాలో మొదలైంది
X
అనుమానాలు.. సందేహాలు.. సంశయాల నడుమ అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు షురూ అయ్యాయి. యూఎస్ లో 5జీ సేవలు మొదలైన నేపథ్యంలో విమానయాన రంగానికి ఇబ్బంది అవుతుందన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు విమానయాన సంస్థలు ఆ దేశానికి వెళ్లాల్సిన విమానాల్ని రీషెడ్యూల్ చేశాయి. అమెరికాకు వెళ్లాల్సిన మన దేశానికి చెందిన ఎయిరిండియాకు చెందిన కొన్ని విమానాల్ని సైతం నడపలేమని ప్రకటించటం గమనార్హం.

ఇక.. అగ్రరాజ్యంలో మొదలైన 5జీ సేవల్ని.. ఏటీ అండ్ టీ.. వెరైజన్ టెలికాం సంస్థలు ప్రారంభించాయి. అయితే.. మొదట్నించి అనుమానాలు ఉన్నప్పటికి విమాన రాకపోకలకు అంతరాయం లేకుండా 5జీ సేవలు షురూ అయ్యాయి. 3.7 - 3.98 గిగా హెర్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణ కోసం గత ఏడాది ఈ రెండు సంస్థలు ఆర్డరు దక్కించుకున్నాయి. ఇందుకోసం లక్షలాది కోట్ల రూపాయిలు వెచ్చించాయి. అమెరికాలో 5జీ సేవలు గత ఏడాది డిసెంబరు 5న ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ సాధ్యం కాలేదు.

ఇంతకీ 5జీ సేవలకు.. విమాన ల్యాండింగ్ కు లింకేమిటి? సమస్యలు ఎందుకు వస్తాయన్నది ప్రశ్నగా మారింది. దీనికి నిపుణులు చెబుతున్నదేమంటే..

- అమెరికాలో 5జీ ఇంటర్నెట్ సేవలకు కేటాయించిన బ్యాండ్ 3.7-3.98 గిగాహెర్ట్జ్‌.
- విమానాల ల్యాండింగ్‌లో కీలకమైన రేడియో అల్టీమీటర్లు పనిచేసే బ్యాండ్‌ 4.2-4.4 గిగాహెర్ట్జ్‌లకు ఇది చాలా దగ్గరగా ఉండటమే ప్రధాన కారణం.
- ఫ్రీక్వెన్సీలు దగ్గరగా ఉండటం వల్ల విమానంలోని రేడియో అల్టీ మీటర్ల పని తీరు దెబ్బ తిని ఇంజన్.. బ్రేకింగ్ వ్యవస్థలు ల్యాండింగ్ మోడ్ లోకి మారకుండా నిరోధిస్తాయన్నది ప్రధానమైన ఆరోపణ.
- ఈ కారణంగా విమానాలు రన్ వేపై దిగవని అమెరికా ఎఫ్‌ఏఏ (ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌) వార్నింగ్ ఇవ్వటం
- అల్టీమీటర్ల పనితీరు దెబ్బతింటే విమానయాన రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందంటూ అమెరికాకు చెందిన విమానయాన సంస్థలన్నీ కలిసి ‘ఎఫ్‌ఏఏ’కి లేఖ రాశాయి.
- 5జీ, విమానాల రేడియో అల్టీమీటర్ల ఫ్రీక్వెన్సీలు చాలా దగ్గరగా ఉండడంపై అమెరికన్‌ టెలికం దిగ్గజాలు ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
- ఈ ప్రధాన సమస్య కారణంగానే 5జీ సేవల్ని ప్రారంభించాలని భావించి సైతం.. రెండుసార్లు వాయిదా వేశారు.
- తాజాగా ఉన్న సందేహాల నేపథ్యంలో 5జీ సేవల్ని కొన్ని విమానాశ్రయాల వద్ద వాయిదా వేయటానికి ఈ టెలికాం సంస్థలు అంగీకరించాయి. దీంతో.. 5జీ సేవల ప్రారంభం సులువైంది.
మరి.. ఇప్పటికే 5జీ సేవల్ని అందిస్తున్న దేశాల్లో ఈ సమస్యలు తలెత్తలేదా? వాటిని ఎలా అధిగమించారు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. దీనికి సమాధానం ఏమంటే..

ఇప్పటికే 5జీ సేవల్ని ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో అందిస్తున్నారు. అయితే.. 5జీ సేవలకు కేటాయించిన స్పెక్ట్రామ్ వేరుగా ఉండటంతో ఈ సమస్య రాలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యను అధిగమించటానికి వీలుగా అమెరికాలోని 50 విమానాశ్రయాలను తాత్కాలిక బఫర్ జోన్ గా ఎఫ్ఏఏ ప్రకటించింది. అంటే.. ఇక్కడ 5జీ సేవలు అందుబాటులో ఉండవు.

అంతేకాదు.. అమెరికాలో మొదలైన 5జీ సేవల కారణంగా ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్న అల్టీమీటర్లను కూడా మార్చనున్నారు. అంతేకాదు.. ఎయిర్ పోర్టుల చుట్టూ కనీసం 2 మైళ్ల వ్యాసంలో 5జీ నెట్ వర్కులు ఉండకూడదని కూడా విమానయాన సంస్థలు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.