Begin typing your search above and press return to search.

అక్టోబరు 1 విడుదల.. దేశంలో 5జీ సేవలు

By:  Tupaki Desk   |   25 Sep 2022 3:18 PM GMT
అక్టోబరు 1 విడుదల.. దేశంలో 5జీ సేవలు
X
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ వాణిజ్య సేవలు అక్టోబరు ఒకటో తేదీ నుంచి షురూ కానున్నాయి. దీనికి సంబంధించిన కీలక ప్రకటన వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ చేతలు మీదుగా ఈ సేవల్ని ప్రారంభించనున్నారు. తాజాగా ఈ సమాచారాన్ని కేంద్ర సమాచార శాఖ పరిధిలోని నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ఈ విషయాల్ని వెల్లడించింది.

రిలయన్స్ జియో.. భారతీ ఎయిర్ టెల్.. వొడాఫోన్ ఐడియాలు తొలుత ఢిల్లీ.. ముంబయి.. హైదరాబాద్ తో సహా మొత్తం ఏడు నగరాల్లో 5 జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 5జీ సేవల్ని ఒక్కో టెల్కో 13 నగరాల్లో సేవల్ని షురూ చేస్తారు. అయితే.. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అక్టోబరు 1 నుంచి నాలుగు వరకు ఆసియాలోనే అతి పెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఢిల్లీలో జరగనుంది.

ఈ సందర్భంగా టెలికం కంపెనీలు తమ 5జీ టెక్నాలజీని ప్రదర్శించనున్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో వేదికను పంచుకోవటానికి టెలికం దిగ్గజ అధినేతల అంతా వస్తుండటం. రానున్న రెండు.. మూడేళ్లలో దేశ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. 5జీ సేవల నెట్ వర్కు కోసం టెలికం కంపెనీలు రూ.3లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనికారణంగా భారీగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. 4జీ సేవల మాదిరే 5జీ సేవల ధరలు సైతం అందరికి అందుబాటులో ఉండేలా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.