Begin typing your search above and press return to search.

ఎదురుగాలి వీస్తోంది.. ట్రంప్ కు తాజాగా షాకిచ్చిన రిపబ్లికన్లు

By:  Tupaki Desk   |   21 Sep 2020 6:15 AM GMT
ఎదురుగాలి వీస్తోంది.. ట్రంప్ కు తాజాగా షాకిచ్చిన రిపబ్లికన్లు
X
అధికారం శాశ్వితం కాదు. అదెప్పుడో ఒకసారి చేజారేదే. అలాంటప్పుడు అత్యున్నత స్థానంలో ఉన్న వారు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ చిన్న తప్పు దొర్లినా.. తాము చేసిన తప్పును చరిత్ర అదే పనిగా గుర్తు చేస్తూ ఉంటుంది. అమెరికా అధ్యక్ష పదవి లాంటి అత్యున్నత పదవిలో ఉన్న అధినేత తీసుకునే నిర్ణయాలు చాలావరకు ఇప్పటివరకు సాగుతున్న సంప్రదాయాల్ని కొనసాగించేలా ఉండాలి. అందుకు భిన్నంగా ఉండటం ఏ మాత్రం సరికాదు.

తానేం అనుకుంటే అది తప్పనిసరిగా జరగాలని బలంగా కోరుకునే ట్రంప్ సంప్రదాయాల్ని.. కొన్ని విధానాల్ని అస్సలు పట్టించుకోరు. అందుకు తగ్గట్లే మూడు రోజుల (శుక్రవారం) క్రితం అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్ (87) మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంలోనే కొత్త న్యాయమూర్తిని నియమిస్తానని ట్రంప్ చేసిన ప్రకటనను పలువురు తప్పు పడుతున్నారు.

సాధారణంగా ఎంతటి ఉన్నత పదవిలో ఉన్న వారైనా.. తాము పదవీ విరమణ చేసే సమయం దగ్గరకు వచ్చినప్పుడు కీలక నిర్ణయాల్ని తీసుకోకుండా.. తమ తర్వాత వచ్చే వారు ఎంపిక చేసేలా నిర్ణయాల్ని వదిలేస్తుంటారు. సంప్రదాయమే కాదు.. విధాన పరంగా కూడా ఇదే సరైన పద్దతి. పదవీ కాలం పూర్తయ్యే వేళలో కీలక నిర్ణయాలు ఎప్పుడు వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. అందుకే.. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంటారు. అందుకు భిన్నంగా ట్రంప్ మాత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎంపిక చేస్తామన్న ప్రకటన చేయాలన్న పట్టుదలతో ఉన్నారు.

ఆయన నిర్ణయాన్ని సహజంగానే డ్రెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రాట్ల అభ్యర్థిగా నిలిచిన బైడెన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు నామినేట్ చేసే ఏ అభ్యర్థికి ఓటు వేయకూడదని రిపబ్లికన్లను కోరారు. అంతేకాదు.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. తాను కానీ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. ఆఫ్రికన్ - అమెరికన్ మహిళను సుప్రీంకోర్టుకు నామినేట్ చేస్తానని చేసిన ప్రకటన పలువురిని ఆకర్షిస్తోంది.

ఇదిలా ఉంటే.. వంద సీట్ల చాంబర్ లో ఇప్పటికే ట్రంప్ ప్రతిపాదనను 53 మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అంతేకాదు.. 62 శాతం మంది అమెరికన్లు కొత్త అధ్యక్షుడే సుప్రీం న్యాయమూర్తిని నియమించాలని భావిస్తున్నట్లుగా రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఊహించని రీతిలో రిపబ్లికన్ల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత ట్రంప్ కు షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.