Begin typing your search above and press return to search.

50 లక్షల కరోనా మరణాలు ..అగ్రస్థానం అమెరికాదే , రెండో స్థానం ఎవరిదంటే

By:  Tupaki Desk   |   18 Oct 2021 12:30 PM GMT
50 లక్షల కరోనా మరణాలు ..అగ్రస్థానం అమెరికాదే , రెండో స్థానం ఎవరిదంటే
X
కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కొనసాగుతుంది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా కరోనా పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పలేని పరిస్థితి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా దేశాల్లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దీంతో ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23.75 కోట్లకు చేరింది. అటు కరోనా మరణాల సంఖ్య 48.40 లక్షలు దాటి 50 లక్షలకు చేరువ అయ్యింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ వివరాలను వెల్లడించింది.

 అగ్రరాజ్యం అమెరికా  కరోనా మహమ్మారికి తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడ మొత్తం 4,43,17,553 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా మరణాలు కూడా అమెరికాలో భారీగానే నమోదయ్యాయి. మొత్తం 7,12,972 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత 3,39,35,309 కేసులతో భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బ్రెజిల్ (2.15 కోట్లకుపైగా), బ్రిటన్ (81.58 లక్షలకుపైగా), రష్యా (76.31 లక్షలకుపైగా), టర్కీ (74.16 లక్షలకుపైగా) దేశాలు ఉన్నాయి.

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 11 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14,146 కొత్త కేసులు వెలుగుచూశాయి. శనివారం 144 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4,52,142కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 19,788 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,34,19,749కి చేరింది. రికవరీ రేటు 98.10 శాతానికి చేరింది. గత సంవత్సరం మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల దిగువకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,95,846కి తగ్గింది. పాజిటివిటీ రేటు 0.57 శాతానికి తగ్గి 220 రోజుల కనిష్టానికి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగానే జరుగుతోంది. శనివారం 41,20,772 మందికి టీకాలు పంపిణీ చేయగా, ఇప్పటి వరకు ఏదో ఒక టీకా డోసు తీసుకున్నవారి సంఖ్య 97.65 కోట్లు దాటింది.