Begin typing your search above and press return to search.

గోదావ‌రి బ్రిడ్జికి 47 ఏళ్లు.. చెక్కు చెద‌ర‌లేదు.. పాపాఘ్ని `పాపం` ఎవ‌రిది?

By:  Tupaki Desk   |   23 Nov 2021 3:30 PM GMT
గోదావ‌రి బ్రిడ్జికి 47 ఏళ్లు.. చెక్కు చెద‌ర‌లేదు.. పాపాఘ్ని `పాపం` ఎవ‌రిది?
X
ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ను క‌లిపే రైల్‌-క‌మ్ రోడ్ బ్రిడ్జి గురించి.. ఆస‌క్తిక‌ర విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. ఎందుకంటే.. ఇటీవల రెండు రోజుల కింద‌ట కురిసిన వ‌ర్షాల‌తో క‌డ‌ప జిల్లాలోని పాపాఘ్ని న‌దిపై ఉన్న సింగిల్‌(రోడ్ ర‌వాణా) బ్రిడ్జి మెలిక‌లు తిరిగి.. నీటి మ‌ట్ట‌మైంది.

కుప్ప‌కూలిపోయింది. దానిని నిర్మించి పాతిక సంవ‌త్సరాలే అయింది. కేవ‌లం పాతికేళ్ల‌లోనే .. ఇంత పెద్ద క‌ట్ట‌డం కుప్ప‌కూల‌డం.. స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ క్ర‌మంలోనే రైల్‌-క‌మ్ రోడ్ బ్రిడ్జిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నాణ్య‌త‌లో లోపాలు.. పాల‌కుల ప‌ర్య‌వేక్ష‌ణ నిర్ల‌క్ష్యాలు వెర‌సి.. కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నంతో నిర్మించిన క‌ట్ట‌డం ఒక వ‌ర‌ద‌ను కూడా త‌ట్టుకోలేక పోయిందా? అనే చ‌ర్చ వ‌స్తోంది.

ఎందుకంటే.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ను క‌లిపే.. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే వంతెనల్లో ఇది మూడోది. 1970లో నిర్మాణం ప్రారంభం కాగా... 1974, న‌వంబ‌రు 23న‌ అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ ఆహమ్మద్ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన పొడవు 4.1 కిలోమీటర్లు. అయితే.. ఇప్ప‌టికి 47 ఏళ్లు పూర్తిచేసుకున్నా.. ఈ వంతెన చెక్కు చెద‌రక పోవ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. చిన్న‌పాటి మ‌ర‌మ్మ‌తులే త‌ప్ప‌..భారీ స్థాయి లోపాలు కూడా ఈ బ్రిడ్జికి లేక పోవ‌డం విశేషం. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే.. పాల‌కుల చిత్త‌శుద్ధి. అవినీతి లేక‌పోవ‌డం. అంత‌కు మించి ఏమీ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

భారత దేశంలోని జీవ నదుల్లో గోదావరి ఒకటి. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టిన గోదావరి తెలంగాణ మీదుగా ప్రవహించిన భద్రాచలం దాటాక ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహించే ఈ జీవనది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిగా కనువిందు చేస్తుంది.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను వేరుచేసే గోదావరి నదిపై రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య భారీ వంతెనలు దర్శనమిస్తాయి. ఈ వంతెనలు ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకే కాకుండా పర్యాటకంగానూ ఎంతో మందిని ఆకర్షిస్తుంటాయి.

ఇలా.. ఇక్క‌డి వారి కోసం నిర్మిత‌మైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ప్ర‌తి ఏటా.. గోద‌వ‌రికి వ‌ర‌ద‌లు వ‌స్తూనే ఉన్నాయి. భారీ ఎత్తున జ‌లాల మ‌ధ్య ఈ బ్రిడ్జి నానుతూనే ఉంది. అంతేకాదు.. అంత‌ర్జాతీయ ర‌హ‌దారి కూడా దీనిపై నిర్మిత‌మైంది.

భారీ నుంచి అతి భారీ వాహ‌నాలు కూడా దీనిపై నుంచి ప్ర‌యాణిస్తుంటాయి. అయిన‌ప్ప‌టికీ.. ఈ వంతెన చెక్కు చెద‌ర‌లేదు. కానీ.. క‌డ‌ప జిల్లాలో పాపాఘ్నిన‌దిపై నిర్మించిన వంతెన మాత్రం ఇటీవ‌ల పెన్నా న‌దికి వ‌చ్చిన వ‌ర‌ద‌లో మెలిక‌లు తిరుగుతూ.. కుప్ప‌కూలింది.

పోనీ.. ఇదేమ‌న్నా అంత‌ర్జాయ ర‌హ‌దారా? అంటే కాదు. మ‌రి ఏం జ‌రిగింది? అంటే.. అంతా అవినీతి.. నిర్మాణ లోప‌మేన‌ని ఇంజ‌నీర్లు చెబుతున్నారు. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం క‌మిష‌న్‌ను వేసి విచారిస్తుందా? లేదా? అనేది చూడాలి. ఎప్పుడో ఏళ్ల కింద‌ట నిర్మించిన వంతెన‌లే బాగుంటే.. ఇటీవ‌ల నిర్మించిన‌వి నాశ‌నం కావ‌డం.. పాల‌కుల చిత్త శుధ్దికి నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.