ఏపీలో మిస్ అయిన 453 మంది విదేశీయులు..ఎక్కడున్నారంటే?

Sat Mar 28 2020 16:20:31 GMT+0530 (IST)

453 People Foreign Returnees Missed in Andhra

కరోనా వైరస్ ..ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటుగా భారత్ ని కూడా భయంతో వణికించేస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా కేసులు ఎక్కువగా విదేశాల నుండి వచ్చిన వారిలోనే నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు భారత్ లో నమోదైన చాలా కేసులు ..విదేశాల నుండి వచ్చిన వారే కావడం గమనార్హం. దీనితో  వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిపై నిఘా పెట్టాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే విదేశాల నుండి వచ్చిన వారు  తగిన పరీక్షలు నిర్వహించుకుని - క్వారంటైన్ లో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ తాజాగా లెక్కల ప్రకారం చూస్తే  విదేశాల నుండి ఏపీలోని విశాఖకు వచ్చిన వారిలో 453 మంది ఆచూకీ లభించడం లేదు.  వారంతా ఏమయ్యారో - ఎటు వెళ్లారో అంతుచిక్కడం లేదు. దీనిపై అధికారులతో పాటు ప్రజాసంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిలోకి వచ్చిన తరువాత గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి విశాఖపట్నానికి వివిధ మార్గాల్లో వచ్చిన వారి వివరాలు జిల్లా అధికారులు సేకరించారు.

కాగా ఇటీవల వైద్య - ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని ఇక్కడకు వచ్చినప్పుడు మొత్తం 3746 మంది విదేశాల నుంచి విశాఖ వచ్చారని ప్రకటించారు.  వారందరు 14 రోజులు క్వారంటైన్ లో వుండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.జిల్లా అధికారులు కరోనాకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడిస్తూ 2795 మంది మాత్రమే విదేశాల నుంచి వచ్చారని వారంతా హోమ్ క్వారంటైన్ లో వున్నారని పేర్కొన్నారు. వారిలో 28 రోజులు పూర్తయినవారు 137 మంది - 15-27 రోజులు పూర్తయినవారు 999 మంది - 14 రోజులలోపు వారు 1498 మంది వున్నారని వివరించారు. కానీ మిగిలిన  453 మంది ఎక్కడున్నారో తెలియడం లేదు అని జిల్లా కలెక్టర్ తెలిపారు. కొందరు పాస్ పోర్టులో పేర్కొన్న చిరునామాల్లో లేరని ఎక్కడికి వెళ్లిపోయారో తెలియడం లేదన్నారు. దీనితో  విదేశాల నుండి వచ్చిన వారు ఎవరైనా వుంటే...స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు తెలిపాలని  - ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.