దివిసీమ ఘోర కలికి 42 ఏళ్లు ...

Tue Nov 19 2019 13:32:05 GMT+0530 (IST)

42 Years Before Diviseema uppena

దివిసీమ ఉప్పెనకు నేటికీ సరిగ్గా 42 ఏళ్ళు. 1977 నవంబరు 19న అర్ధరాత్రి సముద్రం ఉగ్రరూపం దాల్చి దివిసీమను తుడిచి పెట్టేసింది. 1977 నవంబర్ 14న బంగాళాతంలో వాయుగుండం ఏర్పడింది. ఒంగోలు - కాకినాడకు మధ్యలో 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుపాను బలపడి పెను తుపానుగా మారగా - 18వ తేదీ సాయంత్రం వాతావరణంలో మార్పులు సంభవించాయి. అయితే  అంతగా పట్టించుకొని  దివిసీమ ప్రజలు నిద్రలో మునిగిపోయారు. ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో సముద్రుడు ఉగ్రరూపం దాల్చి భారీ ఎత్తున అలలతో ఎగిసిపడ్డాడు. ఒక పక్క వర్షం. మరో పక్క ఈదురుగాలులు  కొద్ది క్షణాల్లో దివిసీమ మొత్తం చీకటిమయంగా మారటంతో ఆ  ప్రాంతాల్లో ప్రజలు ఏమి జరుగుతుందో అర్ధంకాక భయంతో వణికిపోయారు. అకస్మాత్తుగా ఉవ్వెత్తున ఎగసిపడిన సముద్రపు అలలు ఊళ్ళకు ఊళ్లనే తుడిచిపెట్టాయి.సముద్రం నుంచి దివిసీమలోకి 40కి.మీ విస్తీర్ణం వరకూ చొచ్చుకొచ్చిన నీరు 31 గ్రామాలను తుడిచి పెట్టేసింది. దివిసీమతో పాటు కృష్ణా - గుంటూరు - ప్రకాశం జిల్లాలో ప్రళయం సృష్టించిన తుపాను 14204 మందిని పొట్టన పెట్టుకుంది. అత్యధికంగా దివిసీమలోనే 8504 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రళయంలో చిక్కుకుని కొందరు చెట్లకు  వేలాడుతూ - మరికొందరు ముళ్ళపొదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి - మరికొందరు నీటిప్రవాహంలో మునిగి తేలియాడుతూ కనిపించటంతో ఆయా ప్రాంతాల్లో మృతుల కుటుంబ సభ్యులు - బంధువుల రోధనలతో నిండింది. ఈ ఉప్పెనకు బంగాళాఖాతంలో చిక్కుకున్న 13ఓడలు గల్లంతయ్యాయి.

నాగాయలంక మండలం సొర్లగొంది - గణపేశ్వరం - దీనదయాళ్ పురం - బిల్లీగ్రహం నగర్ తోపాటు పెదపాలెం - పెదకమ్మవారిపాలెం - గుల్లలమోద - ఈలచెట్లదిబ్బ - ఎదురుమొండి - నాచుగుంట తదితర ప్రాంతాలు ఉప్పెన ప్రవాహంలో మునిగి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. గణపేశ్వరం పంచాయతీ శివారు బిల్లీగ్రహంనగర్ లో ఉప్పెనలో పూరిగుడిసె లో ఉన్నవారు చర్చిలో తలదాచుకోవటానికి వెళ్ళి అక్కడ తలదాచుకోగా  అక్కడికి కూడా నీరు చేరి 70 మంది మృతిచెందారు.ఈ మొత్తం ప్రళయానికి రూ.172కోట్లు ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ  ఉప్పెన నుంచి దివిసీమ తేరుకునేందుకు రెండేళ్ల సమయం పట్టింది. ఉప్పెన అనంతరం ఎన్నో దేశ - విదేశాల నుంచి వచ్చిన స్వచ్చంద సేవాసంస్ధలు దివిసీమ పునర్నిర్మాణంలో ఎంతో కీలకపాత్ర పోషించాయి. దివంగత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు స్వచ్చంద సంస్ధలను ఈ ప్రాంతానికి తీసుకు వచ్చి సేవలందించారు. ఉప్పెన అనంతరం సేవలకు గుర్తుగా కొన్ని గ్రామాల పేర్లు కూడా  మారిపోయాయి. ఆ గ్రామాలకి సేవలు  చేసిన వారి గుర్తుగా కొన్ని గ్రామాలకి ఆ స్వచ్చంధ  సంస్థల పేర్లని పెట్టుకున్నారు.  ఇక అప్పటి నుండి నేటి వరకు కూడా  దివిసీమ వాసులు  నవంబరు నెల వస్తుందంటే మళ్లీ ఎలాంటి ప్రళయం ముంచుకొస్తుందోనని వణికిపోతుంటారు.