Begin typing your search above and press return to search.

కొత్త టెన్షన్..హైదరాబాద్ జర్నలిస్టుల్లో నలుగురికి పాజిటివ్..

By:  Tupaki Desk   |   31 May 2020 6:12 AM GMT
కొత్త టెన్షన్..హైదరాబాద్ జర్నలిస్టుల్లో నలుగురికి పాజిటివ్..
X
భయపడిందంతా జరిగింది. మాయదారి రోగం అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. ముప్పు ఏ మూల నుంచైనా విరుచుకుపడే ప్రమాదం ఉందన్న అంచనాకు తగ్గట్లే.. తాజాగా హైదరాబాద్ లోని నలుగురు జర్నలిస్టులకు పాజిటివ్ గా తేలింది. దీంతో.. ఒక్కసారిగా మీడియా వర్గాలు ఉలికిపాటుకు గురయ్యాయి. విరుచుకుపడుతున్న మాయదారి రోగాన్ని మరింత బాగా కవర్ చేయాలన్న తలంపుతో పాటు.. అంతకంతకూ పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో మరింత చురుగ్గా పని చేయక తప్పని పరిస్థితి.

ఇలాంటివేళ.. నలుగురికి పాజిటివ్ గా తేలింది. అయితే.. ఈ నలుగురిలో ముగ్గురుజాతీయ మీడియాకు పని చేసే వారే కావటం గమనార్హం. అంతేకాదు.. ఈ ముగ్గురు ఫోటో జర్నలిస్టులు కావటం మరో కోణంగా చెప్పాలి. ఇక.. నాలుగో వ్యక్తి ప్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఒకేరోజు నలుగురు జర్నలిస్టులకు పాజిటివ్ అని తేలటంతో.. వారితో పాటు తిరిగే మరో 20 మంది జర్నలిస్టులకు నిర్దారణ పరీక్షలునిర్వహించినట్లు చెబుతున్నారు.

తాజాగా గుర్తించిన నలుగురు జర్నలిస్టులలో పాజిటివ్ లక్షణాలు తక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో వారికి క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచన చేశారు. ఈ నేపథ్యంలో మాయదారి రోగానికి సంబంధించిన వార్తల సేకరణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నది మర్చిపోకూడదు.

ఇదిలా ఉంటే ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. అంతేకాదు.. ఉస్మానియా ఆసుపత్రి క్యాంటీన్ లో పని చేసే సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ అని తేలింది. దీంతో.. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసుపత్రి క్యాంటీన్ లో పని చేసే సిబ్బందికి పాజిటివ్ గా తేలటంతో.. నిత్యం అక్కడకు వెళ్లే వారంతా ఇప్పుడు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.