Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త‌గా 26 జిల్లాలు... జ‌గ‌న్ ఆదేశాలు..!

By:  Tupaki Desk   |   27 Nov 2021 11:30 PM GMT
ఏపీలో కొత్త‌గా 26 జిల్లాలు... జ‌గ‌న్ ఆదేశాలు..!
X
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారం నుంచే తాను ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే జిల్లాల సంఖ్య‌ను పెంచుతాన‌ని చెపుతూ వ‌స్తున్నారు. అయితే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు దాటుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఏపీలో రాజ‌కీయ వేడి రాజుకుంటోన్న టైంలో జ‌గ‌న్ జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వ‌డం విశేషం.

జ‌న‌గ‌ణ‌న పూర్త‌య్యేలోగా జిల్లాల విభ‌జ‌న‌కు సంబంధించిన ప్ర‌క్రియ పూర్తిచేసి నోటిఫికేష‌న్‌ను రెడీ చేయాల‌ని వారికి ఆదేశాలు ఇచ్చారు. ఈ లోగా నోటిఫికేష‌న్లు ఇవ్వ‌డంతో పాటు జ‌నాభా అభిప్రాయాలు కూడా తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించిన‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వంగా ఆయ‌న 2017 నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లా చేస్తాన‌ని చెప్పారు.

గ‌త ఎన్నిక‌ల మేనిఫొస్టోలో కూడా అదే ఉంది. ఇక ఇప్పుడు 25 పార్ల‌మెంటు స్థానాల‌కు 25 కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే నాలుగు జిల్లాల్లో విస్త‌రించి ఉన్న అర‌కు పార్ల‌మెంటు స్థానాన్ని మాత్రం రెండు జిల్లాలు చేయ‌నున్నారు. దీంతో ఏపీలో మొత్తం జిల్లాలు 26కు చేరుకుంటాయి. అర‌కు పార్ల‌మెంటు స్థానాన్ని పార్వ‌తీపురం జిల్లాగాను, అర‌కు జిల్లాగాను విభ‌జిస్తారు.

శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగిన పార్టీ పార్ల‌మెంట‌రీ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఉన్న‌తాధికారుల స‌మ‌క్షంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటిని ప‌ర‌ష్క‌రించ‌కుండా ఆఘ‌మేఘాల మీద ఈ కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యం తీసుకోవ‌డం.. ప్ర‌తిప‌క్షాల‌ను, ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు అన్న విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్నాయి.