Begin typing your search above and press return to search.

దుబ్బాక బరిలో నిలిచేది ఎందరో తేలింది?

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:35 PM GMT
దుబ్బాక బరిలో నిలిచేది ఎందరో తేలింది?
X
తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక దుబ్బాకలో ఎవరు గెలుస్తారనే టెన్షన్ రాజకీయవర్గాల్లో ప్రజల్లో నెలకొంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. సోమవారం నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది.

టీఆర్‌ఎస్‌ తరఫున సోలిపేట సుజాతారామలింగారెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని పదిలపరుచుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. నియోజకవర్గంలోని మండలానికి, గ్రామానికి,100 మంది ఓటర్లకు ఇన్‌చార్జీలను హరీష్ రావు నియమించారు. దుబ్బాక గెలుపు నల్లేరు మీద నడకలా భావిస్తున్న మంత్రి హరీశ్‌ రావు.. మెజార్టీ పైనే దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగానే తన కార్యాచరణను అమలు చేస్తున్నారు.

ఇక బీజేపీ తరుఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందుండి నడిపిస్తున్నారు. రఘునందన్ రావును గెలిపించేందుకు శాయశక్తులు ఒడ్డుతున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తరుఫున రేవంత్ రెడ్డి, ఉత్తమ్ దుబ్బాకలో మంత్రాంగం నడుపుతున్నారు.

దుబ్బాక బరిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోరు నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోరులో విజేతలు ఎవరనేది ఆసక్తి రేపుతోంది. దుబ్బాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రం ముగిసింది. మొత్తం 46మంది నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో 11 మంది నామినేషన్లు సోమవారం నాటికి ఉపసంహరించుకున్నారు. మరో 12 నామినేషన్లు స్కృటిని దశలో తిరస్కరణకు గురయ్యాయి.