ఒలంపిక్స్ విలేజ్ : మెడల్స్ ఏమో కానీ కేసులు మాత్రం పెరిగిపోతున్నాయ్ ?

Fri Jul 23 2021 21:00:01 GMT+0530 (IST)

19 more people in the Olympics village have tested positive

టోక్యోలో ఒలంపిక్స్  సంరంభం ప్రారంభం అయింది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పుడు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ప్రేక్షకులు లేకుండానే తొలిసారి ఒలింపిక్స్ క్రీడలు జరగబోతున్నాయి. తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించేందుకు క్రీడాకారులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జపాన్ క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి పతకాల తయారీ వరకు  వినూత్న మార్గాలను ఎంచుకుంది. ఇదిలా ఉంటే కరోనా కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఒలింపిక్ క్రీడల్ని నిర్వహిస్తున్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసున్నా కరోనా మహమ్మారి కోరల్లో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా చిక్కుకుంటూనే ఉన్నారు.  కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ఒలింపిక్ క్రీడలు ఆలస్యం అయ్యాయి. 2020లోనే జరగాల్సిన క్రీడలు 2021లో జరుగుతున్నాయి. కానీ కరోనా మాత్రం ఇంకా అదుపులోకి రాకుండా సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అంటూ చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో జపాన్ లోని ఒలింపిక్ గ్రామంలో కొత్తగా మరో 19మందికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో మొత్తం కరోనా కేసులు 100 దాటి 106కు చేరాయి. ఇలా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒలింపిక్ క్రీడలని రద్దు చేయాలనే డిమాండ్ కూడా పెరిగిపోతుంది.

ఒలింపిక్స్ గ్రామంలో మరో 19 మందికి పాజిటివ్ గా తేలినట్టు ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ తాజాగా ఈరోజే (శుక్రవారం) ప్రకటించింది. దీనితో అక్కడ మొత్తం కేసుల సంఖ్య వంద దాటేసింది. పాజిటివ్ వచ్చిన వారిలో ముగ్గురు క్రీడాకారులు 10 మంది సిబ్బంది ముగ్గురు మీడియా సిబ్బంది మరో ముగ్గురు ఈవెంట్ కాంట్రాక్టర్లు ఉన్నారని ఒలంపిక్స్ నిర్వహణ కమిటీ తెలిపింది. దీనితో  మొత్తం కేసుల సంఖ్య 106కు పెరిగిందని తెలిపింది. చెక్ రిపబ్లిక్ కు చెందిన నాలుగవ క్రీడాకారుడికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు కరోనా బారిన పడ్డారని..ఒలింపిక్స్ విలేజ్ లో ఆ దేశానివే ఎక్కువ కేసులని తేలింది.

కాగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఒలింపిక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జపాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే వేదిక వద్దకు వెళ్లి మరీ నిరసనలు వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ జ్యోతిని తీసుకొస్తున్న సందర్భంగా జపాన్ వాసులు టోక్యో మెట్రోపాలిటన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కరోనా సంక్షోభం వేళ జరుగుతున్న ఈ విశ్వ క్రీడలకు ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో మరో 5 క్రీడలకు స్థానం కల్పించారు. కరాటే స్కేటింగ్ స్పోర్ట్ క్లైంబింగ్ సర్ఫింగ్ బేస్ బాల్/సాఫ్ట్ బాల్ ఈవెంట్లు కూడా నిర్వహించనున్నారు. బాక్సింగ్ జూడో తైక్వాండో వంటి  ఆటలు ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో ఉండగా.. అదే కోవకు చెందిన కరాటేకు కూడా ఇప్పుడు స్థానం కల్పించారు.