సూరత్ లో ఘోరం..19మంది విద్యార్థులు సజీవదహనం

Fri May 24 2019 23:13:21 GMT+0530 (IST)

19 Dead In Surat Coaching Centre Fire, Students Jumped Off Building

గుజరాత్ లో ఘోరం జరిగింది. సూరత్ లోని సర్తానా ప్రాంతంలో ఇవాళ సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసి పడ్డ అగ్నికీలలకు 19 మంది విద్యార్థులు సజీవదహనం అయ్యారు. సర్తానాలోని తక్షశిల కాంప్లెక్స్ లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.  అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనపై నరేంద్ర మోదీ - గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సర్తానాలోని ఓ భవనంలోని మూడో అంతస్తులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. మంటల నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు కిందకు దూకారు. దీంతో పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో 50 మందికి పైగా విద్యార్థులు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారే. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మంటలను ఆర్పేందుకు 18 ఫైరింజన్లు శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సూరత్ పోలీసు కమిషనర్ తెలిపారు.
 
ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని - సీఎం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని - క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని విజయ్ రూపానీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.