Begin typing your search above and press return to search.

ట్రంప్ సర్కారుపై 174 భారతీయుల పోరాటం

By:  Tupaki Desk   |   16 July 2020 9:45 AM GMT
ట్రంప్ సర్కారుపై 174 భారతీయుల పోరాటం
X
హెచ్‌1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కారు ప్రకటించిన కొత్త విధానంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్, ఇతర రంగాల నిపుణుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ముఖ్యంగా దీని వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నది భారతీయులే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అమెరికన్లను ఆకర్షించడంలో భాగంగా ట్రంప్ సర్కారు దూకుడుగా నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 174 మంది భారతీయులతో కూడిన ఓ బృందం.. ట్రంప్ సర్కారు మీద న్యాయపోరాటానికి సిద్ధమైంది.

ట్రంప్ సర్కారు కొత్త విధానం వల్ల వీరిలో చాలామందికి వీసాలు ఆగిపోయాయి. అమెరికాలో ప్రవేశించేందుకు వీలు లేని పరిస్థితి నెలకొంది. ఈ 174 మందిలో ఏడుగురు మైనర్లు కూడా ఉండటం గమనార్హం. వీరి పిటిషన్‌ను అనుసరించి కొలంబియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ బ్రౌన్ జాక్సన్.. ప్రభుత్వ అధికారులకు నోటీసులు ఇచ్చారు. కరోనా కారణంగా అమెరికాలో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం, అమెరికన్లు రోడ్డున పడటంతో ఈ ఏడాది చివరి వరకు హెచ్-1బి వీసాలు ఆపేస్తూ ట్రంప్ సర్కారు జూన్ 22న నిర్ణయాన్ని ప్రకటించింది. మే నెలకు అమెరికాలో నిరుద్యోగ రేటు 13.3 శాతానికి చేరుకుంది. ఇంతకుముందెన్నడూ ఈ స్థాయిలో నిరుద్యోగ రేటు లేదు అమెరికాలో.