Begin typing your search above and press return to search.

17 మంది సిబ్బందికి కరోనా - అప్రమత్తమైన టీటీడీ

By:  Tupaki Desk   |   6 July 2020 2:58 AM GMT
17 మంది సిబ్బందికి కరోనా - అప్రమత్తమైన టీటీడీ
X
మూడు నెలల విరామం అనంతరం తెరుచుకున్న శ్రీవారి ఆలయానికి కరోనా నిబంధనలతో భక్తులను అనుమతిస్తున్నారు. అయితే తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటం టీటీడీని ఆందోళనకు గురి చేస్తోంది. వారం రోజుల వ్యవధిలో 17 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తులతో పాటు సిబ్బందికి పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. కేసులు మరింతగా పెరిగితే శ్రీవారి దర్శనానికి మరోసారి బ్రేక్ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం రోజుకు 13వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అలిపిరి సమీపంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో విధులు నిర్వహిస్తున్న పదిహేడు మందికి కరోనా సోకిందని తేలింది. అయితే వీరికి భక్తుల ద్వారా కరోనా సోకలేదు. భయపడాల్సింది లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ భావిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడతామని తెలిపింది. ఉద్యోగులకు పరీక్షల్లో భాగంగా ప్రతిరోజు 100 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు.

కరోనా సోకిన ఉద్యోగులు కూడా తిరుమలలో ఉండేవారు కాదని, వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారని చెబుతున్నారు. ఉద్యోగులు, భక్తుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని, ఇందుకు ఎంతైనా ఖర్చు చేస్తామని టీటీడీ తెలిపింది. కరోనా సోకిన ఉద్యోగులకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించామని పేర్కొంది. స్థానిక ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, సీ భాస్కర్ రెడ్డిలతో పాటు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మారెడ్డి ఉద్యోగులను కలిసి ధైర్యం చెప్పనున్నారు.

దాదాపు మూడు నెలల లాక్ డౌన్ అనంతరం జూన్ 8వ తేదీ నుండి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దాదాపు నెల రోజులుగా భక్తులు తరలి వస్తున్నారు. కానీ ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదు. కేవలం ఉద్యోగులకు.. అదీ బయటి నుండి వచ్చిన వారికి మాత్రమే వచ్చింది. ప్రస్తుత పరిస్థితిల్లో ఈ నెల చివరి వరకు భక్తుల సంఖ్యను యథాతథంగా ఉంచనున్నట్లు అధికారులు చెప్పారు.