Begin typing your search above and press return to search.

గుజరాత్ లో పట్టుబడిన 15000 కోట్ల డ్రగ్స్ కథేంటి?

By:  Tupaki Desk   |   21 Sep 2021 11:30 PM GMT
గుజరాత్ లో పట్టుబడిన 15000 కోట్ల డ్రగ్స్ కథేంటి?
X
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. కచ్ జిల్లాలోని ముంద్రా పోర్ట్ లో రెండు కంటైనర్లలో అక్రమంగా రవాణా చేస్తున్న 3000 కేజీల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.15000 కోట్లు ఉంటుందని తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా ఇదే పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన 2988 కేజీల హెరాయిన్ దొరికింది. దీని వెనుకాల తాలిబన్ల హస్తం ఉన్నట్టు గుర్తించారు. ఐఎస్ఐ లింకులు బయటపడుతున్నాయని అంటున్నారు.

అప్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం.. ఆర్థిక చేయూతకు ప్రపంచ దేశాలేవీ ముందుకు రాని పరిస్థితులు నెలకొనడంతో తాలిబన్లు ‘డ్రగ్స్’ సప్లైని ఆదాయ మార్గంగా ఎంచుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.

ముంద్రా పోర్టుకు ఈనెల 15న 2988 కేజీల హెరాయిన్ తో కూడిన రెండు కంటైనర్లు చేరుకున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ టీం పోర్టుకు చేరుకుని తనిఖీ చేసింది. టాల్కం పౌడర్ పేరుతో గూడ్స్ ను తెరిచి చూడగా.. అందులో ఉన్నది హెరాయిన్ అని తేలింది.

విజయవాడకు చెందిన ఆషీ కంపెనీ పేరు మీద కంటైనర్లలో ఈ గూడ్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అప్ఘనిస్తాన్ లోని కాందహార్ లో ఉన్న హాసన్ హుస్సేన్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఈ హెరాయిన్ ను దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు.

అప్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్టుకు.. అక్కడి నుంచి గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు ఈ కంటైనర్లు చేరుకున్నాయి. అప్ఘనిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో డ్రగ్స్ రవాణానే ఏకైక ఆదాయ మార్గంగా తాలిబన్లు భావిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ సాయంతో తాలిబన్లు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు భారత అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే దీంతో సంబంధం ఉన్న ఇద్దరు అప్ఘన్ వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా వారు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక అప్ఘన్ నుంచి ఈ గూడ్స్ ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆషీ కంపెనీ వీరిదేనని తేల్చారు.