Begin typing your search above and press return to search.

షాకింగ్ న్యూస్ : కరోనా పాజిటివ్ వ్యక్తి ఇచ్చిన విందులో 1500 మంది!

By:  Tupaki Desk   |   4 April 2020 9:50 AM GMT
షాకింగ్ న్యూస్ : కరోనా పాజిటివ్ వ్యక్తి ఇచ్చిన విందులో 1500 మంది!
X
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ఘటన మరువకముందే మధ్య ప్రదేశ్‌ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి వచ్చి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా.. అతను ఓ సామూహిక విందు ఏర్పాటు చేసినట్టు వివరాలు బయటకి రావడంతో ఆ విందులో పాల్గొన్నవారందరు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... దుబాయ్‌ లో వెయిటర్‌ గా పనిచేస్తున్న సురేశ్‌ అనే వ్యక్తి తల్లి గత నెలలో మరణించారు. ఆ కారణంతో గత నెల 17 న అతను స్వస్థలం మొరేనాకు దుబాయ్ నుండి తిరిగొచ్చాడు. ఇక మార్చి 20న తన తల్లికి దశదిన కర్మ నిర్వహించి బంధువులు - కాలనీవాసులకు భోజనాలు పెట్టించాడు.

ఆ విందుకి దాదాపు 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. ఆ కార్యక్రమం అంతా ముగిసిపోయిన తరువాత మార్చి 25న సురేశ్‌ జ్వరం బారినపడ్డాడు. ముందు సాధారణ జ్వరం అనుకోని ఇంటి వద్దే ఉన్నా - ఆ తరువాత కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి వెళ్లడంతో అతనికి - అతని భార్యకు కరోనా సోకినట్టు ఏప్రిల్‌ 2 న నిర్దారణ అయ్యింది. దీనితో ఆ ఆ దంపతులతో సన్నిహితంగా ఉన్న 23 మందికి పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి పాజిటివ్‌ వచ్చింది. దాంతో మొత్తం 12 మందిని ఆస్పత్రి క్వారంటైన్‌ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని మెరెనా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్సీ బండిల్‌ చెప్పారు.

ఇక కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినవారిని ఇళ్ల వద్దే గృహ నిర్భంధంలో ఉంచామని తెలిపారు. దుబాయ్‌ లోనే అతనికి వైరస్‌ సోకిందని - కానీ లక్షణాలు బయటపలేదని డాక్టర్‌ వెల్లడించారు. ఇక సురేశ్‌ భోజనాలు ఏర్పాటు చేసిన కాలనీ మొత్తాన్ని స్థానిక యంత్రాంగం సీజ్‌ చేసింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా - దేశ వ్యాప్తంగా 2,567 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 72 మంది మరణించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 154 కేసులు నమోదయ్యాయి.