Begin typing your search above and press return to search.

శివమొగ్గలో క్వారీలో భారీపేలుడు..15 మంది మంది దుర్మరణం..!

By:  Tupaki Desk   |   22 Jan 2021 3:30 AM GMT
శివమొగ్గలో క్వారీలో భారీపేలుడు..15 మంది మంది దుర్మరణం..!
X
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించడంతో ఉన్నట్టుండి భూమి కంపించింది. శివమొగ్గలో క్వారీలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఓ క్వారీలో ఉన్నట్టుండి భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటికైతే 15 మంది దాకా మృతిచెందినట్టు సమాచారం. చాలామందికి గాయాలయ్యాయి. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అక్కడ మొత్తం చీకటిగా ఉండటంతో లోపలికి వెళ్లలేకపోతున్నామని వాళ్లు అంటున్నారు. అబ్బలగిరి గ్రామానికి సమీపంలోని హునసోండి అనే క్వారీలో ఈ పేలుడు సంభవించింది.

అయితే పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సైతం భూమి కంపించినట్టు సమాచారం. ప్రస్తుతం బాంబ్​ స్క్వాడ్​ అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

గురువారం రాత్రి 10.20 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు తెలిసింది. సమీపంలోని చిక్కమంగళూరు జిల్లాలో భూమి కంపించింది. అయితే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

శివమొగ్గ జిల్లా కర్ణాటక సీఎం యడియూరప్ప సొంత జిల్లా కావడం గమనార్హం. అయితే ఏ పేలుడు ఎలా సంభవించింది అన్న వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. క్వారీలో ఉండే పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే పేలుడు దాటికి శివమొగ్గ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ భూమి కంపించింది. భారీ శబ్ధాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.