Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ క్రికెట్ లో 14 ఏళ్లు.. సెంచరీ లేక వెయ్యి రోజులు.. ఇలాగైతే

By:  Tupaki Desk   |   19 Aug 2022 5:30 PM GMT
అంతర్జాతీయ క్రికెట్ లో 14 ఏళ్లు.. సెంచరీ లేక వెయ్యి రోజులు.. ఇలాగైతే
X
జీవితం అంటే అంతా సాఫీగా సాగిపోదు.. క్రీడాకారుల జీవితం అయితే అసలే సాఫీగా సాగదు.. ఉదాహరణకు క్రికెట్ నే తీసుకుంటే సచిన్ టెండూల్కర్ లాంటి వాడికే ఎన్నో ఎత్తుపల్లాలు. పరుగులు చేయలేని దశలో"ఎండూ"ల్కర్ అంటూ వెక్కిరింపులు ఎదుర్కొన్నాడతడు. అయితే, దానిని అధిగమించి కెరీర్ ను విజయవంతంగా ముగించాడు సచిన్. మరోవైపు ఏ జూనియర్ స్థాయిలో అదరగొట్టి.. అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘ కాలం జాతీయ జట్లకు ఆడిన క్రికెటర్లు.. అందులోనూ అత్యంత విజయవంతమైన క్రికెటర్లు చాలా అరుదు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి వారు తమ తమ దేశాల అండర్ 19 జట్లకు ఆడినా.. అక్కడి ప్రతిభ చూపింది తక్కువ. కానీ, భారత్ లో అలా కాదు. విరాట్ కోహ్లి అనే మొనగాడు.. అండర్ 19 లో అదరగొట్టాడు. రంజీల్లో దుమ్మురేపాడు. అంతే ఉదుటున జాతీయ జట్టులోకి వచ్చాడు. అక్కడా విజయవంతం అయ్యాడు. అయితే, మూడేళ్లుగా అతడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు.

హాఫ్ సెంచరీలు కాదు.. సెంచరీలు కావాలి ఏడాది నుంచి కోహ్లి ఫామ్ అత్యంత ఆందోళనకరంగా అంశంగా మారింది. అతడు అంతకుముందు రెండేళ్లు అర్ధ సెంచరీలు కొట్టాడు. కానీ, ఇప్పుడు ఆ అర్ధ సెంచరీని కూడా చేరుకోలేకపోతున్నాడు. అసలే కోహ్లి అంటే.. కోరుకునేది సెంచరీనే. కానీ, అదే లేకపోవడంతో అభిమానుల్లో అతడిపై అంచనాలు తగ్గుతున్నాయి. వాస్తవానికి ఈ మూడేళ్లలో ఓ రెండేళ్లు కొవిడ్ కారణంగా పక్కనపెడితే.. ఓ ఏడాది సాదాసీదా ప్రదర్శనను వదిలేస్తే.. ఏడాది నుంచి మాత్రం కోహ్లి ఫామ్ పడిపోసాగింది. ఇటీవలి ఐపీఎల్ సహా ఇంగ్లండ్ పర్యటనే దీనిని సాక్ష్యం.

శతక్కొట్టక వెయ్యి రోజులు... క్రికెట్లో ఎన్ని హాఫ్ సెంచరీలు అయినా చెయ్యని.. సెంచరీకి ఉండే విలువే వేరు. అందులోనూ కోహ్లి వంటి వాడు మూడంకెలకు చేరితే ఆ మజానే వేరు. కానీ, కోహ్లి శతకం అందుకోక వెయ్యి రోజులైంది. చివరి సారిగా అతడు 2019 నవంబరు 22న బంగ్లాదేశ్ పై జరిగిన గులాబీ టెస్టులో కోల్ కతాలో తన హెల్మెట్ ను తీశాడు. మళ్లీ అభిమానులు ఆ సీన్ చూడక వెయ్యి రోజులైపోయింది. ఇక కోహ్లి ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్‌ శర్మ, భువనేశ్వర్ కుమార్‌, షమీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. ఆగస్టు 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్‌తో విరాట్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

14 ఏళ్లలో ఇదే గడ్డు కాలం ఇక కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి గురువారంతో 14 ఏళ్లయింది. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేతో కెరీర్‌ ఆరంభించాడు. అనంతరం జాతీయ జట్టులో కీలక ఆటగాడి మారి ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకుని జట్టుని విజయపథంలో నడిపించాడు. అయితే, ప్రస్తుతం ఏడాది కాలంగా ఎదుర్కొంటున్న గడ్డు కాలం అతడు కెరీర్ లో మరెప్పుడూ ఎదుర్కొనలేదు. 2011 సీజన్ లో టెస్టుల్లో విఫలమైనా వన్డేల్లో అదరగొట్టాడు. ఇక ఈ ఏడాదే అతడు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్నాడు. మరోవైపు ఆసియా కప్, నవంబరులో జరిగే టి20 ప్రపంచ కప్ తో కోహ్లి వన్డే, టి20 కెరీర్ కొనసాగింపుపై స్పష్టత రానుంది. ఏ విధంగా చూసినా అతడికి ఇదే గడ్డు ఏడాది.

నాటి ఒంటరితనం.. నేటి వైఫల్యం తన 14 ఏళ్ల కెరీర్‌ పూర్తయిన సందర్భంగా విరాట్ భావోద్వేగంతో స్పందించారు. '14 ఏళ్ల క్రితం ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టా. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం'అనే క్యాప్షన్‌ జోడించి ఓ వీడియోని పోస్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఎదురైన పలు అనుభవాలను విరాట్‌ పంచుకున్నాడు. కెరీర్‌లోని ఒత్తిడి కొన్నిసార్లు తన మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని కోహ్లీ అన్నాడు. "నన్ను ఆదరించే, ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్నా కూడా నేను ఒంటరివాడిగా ఫీలైన సందర్భాలున్నాయి.

ఇలాంటి పరిస్థితి చాలామందికి ఎదురైందని నేను కచ్చితంగా నమ్ముతున్నా. ఇది చాలా కఠినమైన సమస్య. మనం అన్ని సమయాల్లో బలంగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు అది మిమ్మల్ని బాధిస్తుంది. అథ్లెట్లు విశ్రాంతి తీసుకోవడం, ఆటల ఒత్తిడి నుంచి కోలుకోని కోర్ సెల్ఫ్‌తో తిరిగి కనెక్ట్ కావడం చాలా ముఖ్యం' అని విరాట్ పేర్కొన్నాడు. అయితే, ఈ ట్వీట్ ప్రస్తుతం అతడి కెరీర్ సంక్షోభాన్ని చాటుతోంది. ఒకవేళ రానున్న సిరీస్ లలోనూ విఫలమైతే కోహ్లిని మనం అన్ని ఫార్మాట్లలోనూ చూడలేకపోవచ్చు.