Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు పిలిచింది సరే.. కశ్మీరీ నేతలు చర్చలకు వస్తారా?

By:  Tupaki Desk   |   20 Jun 2021 3:07 AM GMT
మోడీ సర్కారు పిలిచింది సరే.. కశ్మీరీ నేతలు చర్చలకు వస్తారా?
X
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. దేశంలో ఆ మధ్య వరకు ప్రత్యేక రాష్ట్రంగా నిలిచిన జమ్ముకశ్మీర్.. దానికున్న ప్రత్యేక ప్రతిపత్తికి తగ్గట్లే అక్కడి రాజకీయం కూడా ఉంటుందన్నది మర్చిపోకూడదు. యావత్ దేశంలోని మరే రాష్ట్రంలో కనిపించని రాజకీయ ముఖచిత్రం ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఆర్టికల్ 370 విషయంలో మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం తర్వాత.. ఆ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

పలువురు కశ్మీరీ నేతల్ని అదుపులోకి తీసుకోవటమే కాదు.. ఏడాదికి పైనే గృహ నిర్భంధంలో ఉంచటం తెలిసిందే. దీంతో రాజకీయ వైరుధ్యాల్ని.. శత్రుత్వాల్ని వదిలేసి.. అన్ని పార్టీలు ఏకం కావటం లాంటి అరుదైన పరిణామం చోటు చేసుకుంది. కశ్మీర్ లో ఏం జరగాలన్నా.. తమను కాదని జరగటానికి వీల్లేని వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు బీజేపీతో చట్టాపట్టాలేసుకొని తిరిగి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీడీపీ ఛైర్మన్ మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ మొదలు కొని.. బీజేపీని దరికి చేరనిచ్చేందుకు ఇష్టపడని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వరకు అందరూ ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నారు.

కశ్మీర్ విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్ ను మూడు ముక్కలు చేసి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చటం..రాష్ట్ర హోదా ఇవ్వటం లాంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలని.. మునుపటి పద్దతిని పునరుద్దరించాలన్నడిమాండ్ చేస్తున్న వేళ.. మోడీ సర్కారు పిలిచినంతనే కశ్మీర్ పార్టీలు.. నేతలు చర్చల కోసం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ వాదనకు తగ్గట్లే.. ఫరూక్ అబ్దుల్లా.. ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు ఉన్నాయన్నది మర్చిపోకూడదు.

ఈ నెల 24న చర్చలకు రావాలని కేంద్రం నుంచి తమకు ఫోన్లు వచ్చాయని ఫరూక్.. ఒమర్ లతో పాటు పీడీపీ ఛైర్మన్ మెహబూబా ముఫ్తీలు నిర్దారించారు. అయితే.. సమావేశంలో పాల్గొనాలా? వద్దా? అన్న విషయాల్ని నేతలతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలకు కూడా కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించటం గమనార్హం. మొత్తంగా ఈ చర్చలకు 12 మంది నేతల్ని ఆహ్వానించారు. చర్చలకు వచ్చే సమయంలో వీరంతా కరోనా నెగిటివ్ రిపోర్టును తమ వెంట తీసుకురావాలని కోరారు. అయినా.. మోడీ సర్కారు పిలిచినంతనే కశ్మీరీ నేతలు వచ్చేస్తారా? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా మారింది.