Begin typing your search above and press return to search.

భారత్‌ బయోటెక్‌కు రూ.110 కోట్లు.. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   9 Jun 2021 7:31 AM GMT
భారత్‌ బయోటెక్‌కు రూ.110 కోట్లు.. ఎందుకంటే ?
X
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తుంది. ఈ మహమ్మారి దెబ్బకి ఇప్పటికే ఎంతోమంది మృత్యువాత పడ్డారు. కొన్ని కోట్లమంది ఈ మహమ్మారి భారిన పడ్డారు. అలాగే కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే , ఈ మహమ్మారిని అంతం చేయడానికి మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడమే. దీనికోసమే .. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ను శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నాయి. మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది. కొవాగ్జిన్‌ , కోవిషిల్డ్ టీకాలు మనదేశంలోనే తయారు కాగా , మరికొన్ని వ్యాక్సిన్ల వాడకానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే .. భారత్‌ బయోటెక్‌ తయారు చేసే కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఇమ్మ్యూనిటి పవర్ , అలాగే కరోనా ను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది అని నిరూపితం కావడంతో ప్రపంచంలోని పలు దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడాలో కొవాగ్జిన్‌ హక్కులు పొందిన ఆక్యుజెన్‌ తొలి విడతలో భారత్‌ బయోటెక్‌కు 1.5 కోట్ల డాలర్లు (దాదాపు రూ.110 కోట్లు) చెల్లించింది. కెనడాలో కొవాగ్జిన్‌ ను వాణిజ్యపరంగా విడుదల చేసిన తర్వాత నెల రోజుల్లో మరో కోటి డాలర్లను చెల్లించనున్నట్లు తెలిపింది. అమెరికాలో కొవాగ్జిన్‌ టీకాను మార్కెట్లో విడుదల చేయడానికి భారత్‌ బయోటెక్‌, ఆక్యుజెన్‌ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కెనడాలో కూడా ఇదే విధంగా కొవాగ్జిన్‌ ను విడుదల చేయడానికి ఈ ఒప్పందంలో సవరణలు చేశాయి. కాగా 60కి పైగా దేశాల్లో కొవాగ్జిన్‌ కు రెగ్యులేటరీ అనుమతులు లభించాయని భారత్‌ బయోటెక్‌ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు.