10 లక్షల మందిని మోసం చేశారు.. మీరున్నారా చూసుకోండి!

Sun Mar 07 2021 12:00:01 GMT+0530 (IST)

10 lakhs cheated .. See if you are!

మీరు ముగ్గురిని చేర్పించండి.. ఆ ముగ్గురికీ.. తలో ముగ్గురిని చేర్పించమని చెప్పండి.. ఇంతే మీరు చేయాల్సింది. ఇక చూసుకోండి.. ఈ చైన్ పెరుగుతున్న కొద్దీ మీ ఆదాయం పెరుగుతూ పోతుంది. నెలల్లోనే లక్షాధికారులు అయిపోతారంటే నమ్మండి.. అంటూ సాగే గొలుసుకట్టు వ్యాపారాల గురించి చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. గతంలో చాలా పేర్లతో వచ్చిన ఈ చైన్ బిజినెస్.. ఇప్పుడు మరో పేరుతో వచ్చింది. అంతేకాదు.. తన ప్లాన్ కూడా పక్కాగా అమలు చేసింది. దాని విలువ ఎంతో తెలుసా..  1500 కోట్లు!ఇండస్ వివా పేరుతో మొదలైన ఈ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ.. అందిన వారిదగ్గరా దోచేసింది. కేవలం రూ.12500 చెల్లించి తమ సంస్థలో సభ్యత్వం తీసుకోవాలని చెప్పారు. ఆ మేరకు సరుకులు ఇచ్చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మిగిలిన వారిని చేర్పిస్తూ వెళ్తే.. వారి నుంచి వచ్చే డబ్బులో వాటా ఇస్తామని నమ్మబలికారు. ఇలా తెలంగాణలో మొత్తం 10 లక్షల మంది నుంచి డబ్బులు వసూలు చేశారు నిందితులు.

ఈ విధంగా వారి నుంచి రూ.1500 కోట్లు వసూలు చేశారు. అప్పటి వరకూ కొందరికి సరుకులు ఇచ్చేసి ఆ తర్వాత బిచాణా ఎత్తేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు.. లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకూ ఈ స్కాంతో సంబంధం ఉన్నవారిని 24 మందిని అరెస్టు చేశారు.

వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి భార్యలు ఉన్నారు. తేరగా వస్తున్నాయంటే చాలు.. ఎగేసుకొని పోవడం ఆ తర్వాత మోసపోయి లబోదిబోమనడం చాలా మందికి అలవాటుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్ని మోసాలు జరుగుతున్నా.. మళ్లీ అదే రొంపిలో పడుతున్నారని మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.